CM Chandrababu: ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన పాలసీ కావాలన్నారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేశామన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. ఇందులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు.
సమావేశంలో సీఎం వెల్లడించిన కీలక నిర్ణయాలివీ.
- యూనిఫాం సర్వీసుల్లోనూ 3% రిజర్వేషన్ కల్పించేలా క్రీడా విధానంలో ప్రతిపాదన
- శాప్‌లో గ్రేడ్-3 కోచ్‌ల కోసం అంతర్జాతీయంగా పతకాలు సాధించిన వారికి 50% రిజర్వేషన్
- ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న రూ.75 లక్షలు రూ.7 కోట్లకు పెంపు
- రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లకు పెంపు
- కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంపు
- ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం
- ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు
- రజత పతకం సాధిస్తే రూ.2 కోట్లు
- కాంస్య పతకానికి రూ.కోటి
- ఆసియా క్రీడల్లో పాల్గొన్న వారికి రూ.10లక్షలు
- వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత పతకం సాధిస్తే రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు
- జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధిస్తే రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ.3 లక్షలు
- ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకానికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష
- ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి గ్రూపు-1 ఉద్యోగం
- స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతోపాటు తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో సమీకృత క్రీడా కాంప్లెక్స్‌ల ఏర్పాటు. కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ప్రారంభించాలి. విజయనగరంలోని క్రీడా పాఠశాలను గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలి.
- మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాల ఏర్పాటు
- దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్పోర్ట్స్ లీగ్స్‌లో రాష్ట్రం నుంచి జట్లు ప్రాతినిధ్యం వహించాలి.
- రాష్ట్రానికి వరంగా ఉన్న సముద్ర తీరం, కొండలు, అడవులను వినియోగించుకునేలా మౌంటెన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్స్, నేచర్ ఫొటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలి.
- క్రికెట్ ఒక్కటే కాదు...అన్ని క్రీడలనూ ప్రోత్సహించాలి. ఆటలను లక్ష్యంగా ఎంచుకునే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలొస్తాయి. ఎక్కువమంది ఆ దిశగా ప్రయాణం చేస్తారు.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తోపాటు స్వచ్ఛందంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com