CBN: ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్‌

CBN: ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్‌
X
పాలనకే కొత్త అర్థం తెచ్చిన ఎన్టీఆర్... తారక రామం- అన్నగారి అంతరం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

కూడు, గూడు, గుడ్డ నినాదంతో పాలనకే కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే రాజకీయాల్లో మహిళలకు మెుదటిసారి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు రూ.2లకే కేజీ బియ్యం ప్రవేశపెడితే.. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీగా దానికి రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించారని అన్నారు. అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రండ్‌ని అధికారంలోకి తీసుకువచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు.విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని, అలాగే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు.

ప్రముఖ పాత్రికేయులకు సన్మానం

‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. మోహన్ గోటేటి, బీకే ఈశ్వర్, కె.ఉడయవర్లు, కె.ఉమామహేశ్వరరావు, గౌస్, శాతవాహన, యు.వినాయకరావు, రెంటాల జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెమెంటోలు అందుకున్నారు.

ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్..

మనం చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఏడాది మొత్తం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. 75 సంవత్సరాల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక.. ఇది ఒక అపూర్వ ఘట్టమని.. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అనగానే గుర్తుకు వచ్చే మొదటి నాయకులు నందమూరి తారక రామారావు అని తెలిపారు. నాకు ఏ ఇజాలు లేవు.. ఉన్నది ఒకటే అది హ్యూమనిజం అని ఆనాడే తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్ళు పడుతుందని.. కానీ, ఎన్టీఆర్ మాత్రం సంవత్సరానికి 10-15 సినిమాలు నటించేవారని కొనియాడారు. ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించిన అందులో జీవించేవారని.... భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లా విభిన్న పాత్రలు పోషించిన నటులు ఎక్కడా ఉండరని అన్నారు.

Tags

Next Story