AP Assembly: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ ప్రమాణస్వీకారం
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, ఎన్‌ఎండీ ఫరూక్ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్ తదితరులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు.
అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. రెండున్నరేళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని 19 నవంబరు 2021న ప్రతినబూనారు.
అనుకున్నట్టే ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి, నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించాయి.ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com