CBN: "తెలుగుతల్లికి జల హారతి" నా జీవితాశాయం: చంద్రబాబు

గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో రూ.80,112 కోట్లతో గోదావరి-బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ అనుసంధానం పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ‘తెలుగు తల్లికి జలహారతి’ పేరిట చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు వివరించారు. బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ రాయలసీమకు గేట్‌వేగా మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికే గేమ్ చేంజర్ అవుతుందని చెప్పారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏపీలో కరవు మాటే వినబడదన్నారు. నదుల అనుసంధానంతో భవిష్యత్‌లో నీటి సమస్య ఉండదని చెప్పారు.
కేంద్ర ఆర్థికమంత్రికి వివరించాం
ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ‘తెలుగు తల్లికి జలహారతి’పథకం గురించి వివరించానన్నారు. దీనికి ఇప్పటి ధరల ప్రకారం రూ.80,112 కోట్లవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిపాదనల ఆధారంగా.. ప్రాజెక్టుకు నిధులు ఎలా విడుదల చేయాలో ఆలోచిస్తామని ఆమె చెప్పారన్నారు. ఈ పథకాన్ని మరో పదేళ్లు ఆలస్యం చేస్తే .. ఖర్చు మూడింతలు పెరుగుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కలసి హైబ్రిడ్ విధానంలో అమలు చేయాలన్న యోచనలో ఉన్నామని ఆమెకు చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు.
మూడు దశల్లో...
తెలుగుతల్లికి జలహారతి ప్రాజెక్టును మూడు దశల్లో చేపడతామని చంద్రబాబు వివరించారు. గోదావరి జలాలను తొలి దశలో రూ.13,511 కోట్లతో 187 కిలోమీటర్ల మేర పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తామన్నారు. ఇందుకోసం కుడికాలువను 38,000 క్యూసెక్కుల స్థాయికి విస్తరిస్తామని వెల్లడించారు. మార్గమధ్యంలో ఒక లిఫ్ట్‌ను నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు. పది సొరంగాలను నిర్మిస్తామని... అక్కడి నుంచి రెండో దశలో రూ.28,560 కోట్ల అంచనా వ్యయంతో బొల్లాపల్లి రిజర్వాయరులోకి 150 టీఎంసీలు ఎత్తిపోస్తారని వెల్లడించారు. ఇందుకోసం కాలువను 24 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరిస్తామని తెలిపారు. ఆరు లిఫ్టులు పెట్టి 84 కిలోమీటర్ల మేర జలాలు తరలిస్తాం. మూడో దశలో రూ.38,014 కోట్లతో బొల్లాపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 300 టీఎంసీలు ఎత్తిపోస్తాం. మూడు లిఫ్టులతో 108.4 కిలోమీటర్లు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com