Chandrababu Naidu : వరద నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రియల్‌టైమ్‌ అంచనాలతో రిజర్వాయర్లు నింపాలని ఆదేశం

Chandrababu Naidu : వరద నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రియల్‌టైమ్‌ అంచనాలతో రిజర్వాయర్లు నింపాలని ఆదేశం
X

కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. డైనమిక్ వరద నిర్వహణ విధానాల ద్వారా రాష్ట్రంలోని నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్‌టైమ్‌లో అంచనా వేయాలని సూచించారు. వర్షపాతాన్ని ఎప్పటికప్పుడు లెక్కిస్తూ, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషిస్తూ అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని నిర్దేశించారు. వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ముంపు ప్రాంతాలకు ముందస్తు సమాచారం ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలని సూచించారు.

అధికారుల నివేదిక: సముద్రంలోకి భారీగా నీరు విడుదల సమీక్ష సందర్భంగా అధికారులు సీఎంకు వరద పరిస్థితిని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా వరద వస్తోందని.. ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 94 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు.

ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద వస్తున్నందున, వచ్చిన నీటిని వచ్చినట్లుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు కృష్ణా నుంచి 1,089 టీఎంసీలు, గోదావరి నుంచి 3,251 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు సీఎంకి తెలిపారు.

అలాగే ప్రభుత్వం చేపట్టిన సమర్థ నీటి నిర్వహణ, కాలువల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమం వల్ల గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.25 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Tags

Next Story