CBN: అమరావతికి నవ శకం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి ఇది ఒక నవశకమని, చీకటిపై ఆశ గెలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో కీలక అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రజా రాజధాని అభివృద్ధికి పునాది వేసిన ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
చరిత్రలో నిలిచిపోతుంది
అమరావతి పునఃప్రారంభ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మే 2వ తేదీన ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. రైతుల పోరాటం వల్లే అమరావతి తిరిగి ప్రాణం పోసుకుంటుందని చెప్పారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయన్న చంద్రబాబు.. రాజధాని అమరావతి నిర్మాణాలు ఇక పరుగులు పెడతాయని జోస్యం చెప్పారు. మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 'అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దుతాం. మూడేళ్ల తరువాత రాజధాని ప్రారంభానికి మోదీ రావాలి. అమరావతి చరిత్రలో మోదీ పేరు నిలిచిపోతుంది. రాజధాని పనులు రీస్టార్ట్ చేశారు' అని అమరావతి పున: ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు అన్నారు. 'అమరావతి ఒక నగరం కాదు.. ఐదు కోట్ల మంది సెంటిమెంట్. అమరావతి నిర్మాణాన్ని వైసీపీ హయాంలో అడ్డుకున్నారు. ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారు. అమరావతి నాది. దీనిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. రాజధాని కోసం నేను నిరంతరం కృషి చేస్తాను.' అని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. పహల్గామ్ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని తెలిపారు. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు రాక్షసంగా చంపారని.. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా 140 కోట్ల మంది ప్రజలు ఆయన వెనకే ఉంటారని చంద్రబాబు వెల్లడించారు.
చంద్రబాబు ట్వీట్
అమరావతి కేవలం కాంక్రీటు, ఉక్కు కట్టడం మాత్రమే కాదని, అది రాష్ట్ర ప్రజల కలలకు, ఆశయాలకు నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను అందరం కలిసికట్టుగా నిజం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com