CM Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాక ఆవిష్కరణ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నాం.
1857 కంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచాం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్ధిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం. నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తాం. రైతు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం.
యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే తప్పు చేసేవారిని వదిలేది కూడా లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com