CBN: రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా కుప్పం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని శాశ్వతంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుమ్మిశిలో జరిగిన 'ప్రజా వేదిక' సభలో మాట్లాడిన ఆయన, రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నామని, భవిష్యత్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రూ.1292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కుప్పాన్ని రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద మూడు కిలో వాట్ల సౌర విద్యుత్‌కు బీసీలకు రూ.98 వేల రాయితీ అందించనున్నట్టు తెలిపారు. కుప్పం ప్రాంతానికి విమానాశ్రయం, పరిశ్రమలు, కుప్పం–హోసూరు మధ్య రోడ్డు, పలమనేరు–కృష్ణగిరి మధ్య నాలుగు లైన్ల రోడ్డు వంటి ప్రాజెక్టులతో ప్రాధాన్యం పెరుగుతుందని వివరించారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చారు.
‘‘నేను హత్యా రాజకీయాలు చేయను. అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే, కొన్ని శక్తులు ఫలితాలు రాకుండా అడ్డుకుంటున్నాయి. ధర్మాన్ని కాపాడతా, అభివృద్ధికి అడ్డుపడే వారిని ఉపేక్షించను. యజ్ఞం చేయాలి, రాక్షసులపై పోరాడాలి’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com