MLC: చంద్రబాబుతో పవన్ కీలక చర్చలు

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. బడ్జెట్‌తోపాటు వివిధ శాఖలకు కేటాయింపులు, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన చర్చించారు. అలాగే ప్రభుత్వ పథకాలపైనా సీఎంతో పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో దాదాపు గంటపాటు ఇరువురి నేతల భేటీ జరిగింది. ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 11న నామినేషన్ల పరిశీలనకు, 13న నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈవో వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నాగబాబుకు మంత్రి పదవి ఖాయం
ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అవి ఎవరికి దక్కుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వీటిలో నాలుగు టీడీపీకి ఒకటి జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్ష్ కొనసాగుతోండగా.. జనసేన పార్టీ నుంచి మాత్రం నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు.. జనసేన నేత నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం నాగబాబుకు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com