జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ తీర్పు వాయిదా

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ తీర్పు వాయిదా
Jagan bail Cancel Petition: జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును వచ్చే నెల 15కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది.. తీర్పును వచ్చే నెల 15న వెల్లడించనుంది సీబీఐ కోర్టు. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ ముగిసింది. పిటిషనర్లతోపాటు.. ప్రతివాదులు, సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును వచ్చే నెల 15కు వాయిదా వేసింది.

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. జులై 30నే వాదనలు ముగిసాయి. ఇవాళ తుది తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. కానీ... విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కూడా సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రెండూ ఒకే కేసుకు సంబంధించిన పిటిషన్లు కాబట్టి.. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాతనే తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. ఇవాళ్టి విచారణలో పిటిషనర్‌ రఘురామ తరఫు లాయర్‌.. వాదనలు వినిపించారు. జగన్‌ సాకులు చూపుతూ.. 300 సార్లకు పైగా కోర్టు హాజరు నుంచి మినహాయింపులు పొందారని అన్నారు. ఫలితంగా కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని వెల్లడించారు. 2013లోనే ఛార్జిషీట్లు దాఖలైనా ఇప్పటివరకు విచారణ తుది దశకు చేరలేదని తెలిపారు. కేసులో నిందితులు, సాక్షులుగా ఉన్న అధికారులకు ఏపీలో కీలక పదవులు, పదోన్నతులు లభించాయని చెప్పారు. కీలక పదవులు కట్టబెట్టడం వల్ల కేసు విచారణలో తీవ్ర ప్రభావం చూపిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అటు.. సీబీఐ ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు నాలుగు సార్లు గడువు కోరి మొదటిసారి దాఖలు చేసిన మెమోనే పరిగణలోకి తీసుకోవాలని అనడం.. కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. అన్ని పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. చివరకు వచ్చేనెల 15కు తీర్పును వాయిదా వేసింది..

Tags

Read MoreRead Less
Next Story