Badradri Kothagudem: హ్యాట్సాఫ్ కలెక్టర్ సాబ్.. ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం..

Badradri Kothagudem (tv5news.in)
Badradri Kothagudem: ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై మరింత నమ్మకం పెంచేందుకు కొందరు అధికారులు నడుం బిగించారు. తమ భార్యలు, కూతుళ్ల కాన్పులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల ఓ అడిషనల్ కలెక్టర్ స్వయంగా ప్రభుత్వాసుపత్రిలోనే పండంటి బిడ్డను జన్మనిచ్చారు. ఇదే బాటలో నడిచారు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్... గర్భీణీ అయిన తన భార్య మాధవి తొలి కాన్ఫును ప్రభుత్వాసుపత్రిలో చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరిన కలెక్టర్ సతీమణి.. ఈరోజు తెల్లవారుజామున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాధవికి సీజేరియన్ అవసరం కావడంతో గైనలాలజిస్టు సూరపనేని శ్రీక్రాంతి, వైద్య నిపుణులు దీపికల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు పరీక్షించి వైద్యాన్ని అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు ప్రసవం చేయించిన కలెక్టర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై మరింత నమ్మకం పెంచేందుకు ఇటీవలే ఖమ్మం అడిషనల్ కలెక్టర్ స్నేహలత.. తన తొలి కాన్పును ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేయించుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అప్పట్లో అడిషనల్ కలెక్టర్ స్నేహలతను మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శించి ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు.
సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటున్న, చేయిస్తున్న ఉన్నతాధికారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలపై నమ్మకం పెంచేలా చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకోవడం కంటే, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడమే మేలని పేద, మద్య తరగతి ప్రజలు ఆలోచించేలా వారి చర్యలు ఉంటున్నాయి. దీంతో నేను వస్తా బిడ్డా ప్రభుత్వ ఆసుపత్రికి అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com