Nara Lokesh : బెంగళూరు రోడ్లపై కంపెనీ సీఈవో పోస్ట్.. విశాఖ రావాలన్న లోకేశ్

బెంగళూరులో రహదారుల దుస్థితిపై ఒక కంపెనీ సీఈఓ చేసిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. వర్షాలు, సరైన నిర్వహణ లేకపోవడంతో గుంతలమయమైన బెంగళూరు రోడ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బ్లాక్‌బక్ అనే డిజిటల్ ట్రక్కింగ్ ప్లాట్‌ఫాం సీఈఓ రాజేశ్ యాబాజి ఒక పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్సందిస్తూ.. గతంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడం చాలా సులభంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఉద్యోగులకు గంటన్నర సమయం పడుతోందని తెలిపారు. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని, గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
రాజేశ్ యాబాజి పోస్ట్‌కు తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్, ఆయనకు నేరుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న లోకేశ్, బ్లాక్‌బక్ కంపెనీని విశాఖపట్నానికి తరలించాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "హాయ్ రాజేశ్, మీ కంపెనీని విశాఖకు తరలించడంలో నేను ఆసక్తి చూపిస్తున్నా. భారత్‌లోని అత్యంత శుభ్రమైన ఐదు నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మేము మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. అలాగే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా కూడా విశాఖకు గుర్తింపు ఉంది" అని తెలిపారు. ఈ విషయంపై మరింత చర్చించడానికి తనకు నేరుగా సందేశం పంపాల్సిందిగా కూడా రాజేశ్ యాబాజికి లోకేశ్ సూచించారు.
2015లో ప్రారంభమైన బ్లాక్‌బక్ సంస్థ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ట్రక్కింగ్ ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందింది. బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా వ్యాపారాలు తరలిపోవాలని భావిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com