రూ 412 కోట్లతో విశాఖ రుషికొండపై కొత్త భవనాలు

రూ 412 కోట్లతో  విశాఖ రుషికొండపై కొత్త భవనాలు
ఆన్ లైన్ లో జీవోల అప్​లోడ్ తో వెలుగులోకి ఖర్చు వివరాలు

విశాఖలోని రుషికొండపై భవన నిర్మాణాలకు 412 కోట్ల 37 లక్షల రూపాయలు వెచ్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయంగా ప్రచారంలో ఉన్న ఈ భవనాల కోసం పర్యాటకశాఖ గుట్టుచప్పుడు కాకుండా నిధులు విడుదల చేసింది. విలాసవంతమైన ఈ భవనంలో ఫర్నిచర్ కోసం విలువైన ప్రజాధనాన్ని వెచ్చించింది.

విశాఖలోని రుషికొండపై పర్యాటశాఖ పేరు చెప్పి ముఖ్యమంత్రి జగన్ కోసం కార్యాలయం, నివాస భవనాలను కడుతున్నారంటూ కథనాలు రావటంతో అవి అవాస్తవాలని చెప్పేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా..చివరకు కోర్టుల కళ్లు కప్పి నిర్మాణాలు చేసేసింది. విశాఖలో సీఎం క్యాంప్‌ ఆఫీసుగా చెప్పుకుంటున్న ఈ నిర్మాణాల కోసం పర్యాటకశాఖ ద్వారా వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు..స్పష్టమైన ఆధారాలు వెలుగుచూశాయి.

ఇప్పటివరకూ గోప్యంగా ఉంచిన జీవోలు తాజాగా ఒక్కోక్కటిగా విడుదల చేస్తుండటంతో రుషికొండ వద్ద నిర్మాణాలకు ఎంత వెచ్చించారో బయటపడింది. ఈ భవనాల నిర్మాణానికి 412 కోట్ల 37లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇక్కడ చేపట్టిన పనులను...చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించిన పర్యాటకశాఖ 6 జీవోలను జారీచేసి నిధులు విడుదల చేసింది. జీవో నెంబరు 92, 93, 94, 83, 179 పేరిట పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


రుషికొండపై రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్ కోసం 16కోట్ల 40లక్షల రూపాయలు నీటి సరఫరా, ఎలక్ట్రికల్ పనులు, సీవరేజి కోసం 29కోట్ల 80 లక్షల రూపాయలు వెచ్చించారు. రుషికొండపై రిసార్టు రీడెవలప్మెంట్ పేరిట జీవో నెంబరు 83 జారీ చేసిన ప్రభుత్వం...పాతకట్టడాల కూల్చివేత, రుషికొండపై మట్టి తవ్వకాలు, లెవలింగ్, అటవీ ప్రాంతం నరికివేత తదితర పనుల కోసం 94 కోట్ల 49లక్షలు విడుదల చేసింది. జీవో నెంబరు 92 ద్వారా రుషికొండపై వేంగి, గజపతి, కళింగ, విజయనగర బ్లాకులు నిర్మాణం, ఎలక్ట్రికల్ పనులు, శానిటరీ పనులు, ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టింది. వీటన్నిటినీ.... నాన్ ఈపీసీ విధానంలోనే పనులు ముగించేశారు. జీవో నెంబరు 179 ద్వారా రుషికొండపై నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనానికి ల్యాండ్ స్కేపింగ్ కోసం 21కోట్ల 83లక్షల రూపాయలు వెచ్చించారు.

ఈ భవనంలో అత్యంత విలాసవంతమైన కుర్చీలు, ఫర్నిచర్ కొనుగోలు కోసం ప్రజాధనాన్ని పర్యాటకశాఖ ఖర్చు చేసింది. ఈ పనులన్నిటినీ హైదరాబాద్‌కు చెందిన డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు అంచనా కంటే 16.46 శాతం అధిక ధరలకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story