ఏపీలో ముందునుంచి భయపడుతున్నట్టే జరుగుతోంది..

ఏపీలో ముందునుంచి భయపడుతున్నట్టే జరుగుతోంది..
ముందు నుంచి భయపడుతున్నట్టే జరుగుతోంది. ఏపీలోని పాఠశాలల్లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అన్‌లాక్‌లో భాగంగా విడతలవారీగా ఒక్కొక్కటిగా..

ముందు నుంచి భయపడుతున్నట్టే జరుగుతోంది. ఏపీలోని పాఠశాలల్లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అన్‌లాక్‌లో భాగంగా విడతలవారీగా ఒక్కొక్కటిగా అనుమతులిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఈనెల 2న స్కూళ్లను కూడా పునఃప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్థుల్లో కొత్త భయాన్ని పుట్టిస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో పాఠశాలలు రీ ఓపెన్‌ చేసిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. జిల్లాలో నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్‌కు కరోనా సోకింది. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఓ టీచర్‌కు, పీసీపల్లి హైస్కూల్‌లో విద్యార్థికి, ఉపాధ్యాయుడికి, టీచర్‌కు కరోనా వైరస్‌ ఉన్నట్టు తేలింది. పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ టీచర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. స్కూళ్లు మళ్లీ ఓపెన్‌ చేసిన తర్వాత కేసులు పెరగడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు ఉపాధ్యాయులకు చెప్పారు.

చిత్తూరు జిల్లాలోనూ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరందరికీ విద్యాశాఖ అధికారులు కొవిడ్‌ సెలవులు ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తామని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డి తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్‌ ఎడవల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలో 10 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. అక్టోబర్‌ 28న 120 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 28న జరిగిన రాపిడ్‌ టెస్ట్‌లో ఒకరికి కరోనా నిర్ధారణ కాగా.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరో 9 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. 10 మందికి కరోనా నిర్ధారణతో మిగతా విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూలుకు పంపించేందుకు భయపడున్నారు. స్కూళ్లలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. పిల్లల్ని స్కూల్‌కు పంపాలంటేనే భయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story