స్కూల్స్‌లో కరోనా టెర్రర్.. 16 ప్రభుత్వ పాఠశాలల్లో పాజిటివ్ కేసులు

కరోనా వైరల్ ప్రతీకాత్మక చిత్రం
Coronavirus: విజయనగరం జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది.. 10 రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 31 మంది విద్యార్థులకు, ఐదుగురు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. వరుస కేసులు వెలుగు చూస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి.. ఈ పది రోజుల్లో 16 స్కూళ్లలో కేసులు బయటపడ్డాయి. మొత్తం 36 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులే చెబుతున్నారు. బొబ్బిలి, రామలింగాపురం, జొన్నవలస పాఠశాలల్లో 17 మందికి పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో అన్ని తరగతుల విద్యార్థులు ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.
మొదటగా బడులు తెరిచిన మూడో రోజే పూసపాటిరేగ, కుమిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఇద్దరు పదోతరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. చీపురుపల్లి మండలం నిమ్మలవలస ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. దత్తిరాజేరు మండలం వంగరకు చెందిన ఆరుగురు కేజీబీవీ విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించగా, విద్యాశాఖ లెక్కల్లో ఒక్కరు మాత్రమే వున్నారు. సీతానగరం మండలం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు టెన్త్ విద్యార్థులకు వైరస్ సోకింది. కొమరాడ గురుకులంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వైరస్ వ్యాప్తి చెందడంతో టీచర్లు సైతం భయపడుతున్నారు. కరోనా థర్డ్ వేవ్‌కి సంకేతంగా ఉందంటూ తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. అయితే, స్కూల్స్‌లో శానిటైజేషన్, మాస్కులు సరిగా ధరించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com