NARAYANA: జగన్-షర్మిల ఆస్తుల పంచాయతీకి కారణమదే

NARAYANA: జగన్-షర్మిల ఆస్తుల పంచాయతీకి కారణమదే
X
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు.. జగన్ 11 ఏళ్లుగా బెయిల్ ఉన్నారని గుర్తు చేసిన నారాయణ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలలేదు కాబట్టే.. షర్మిల-జగన్ మధ్య ఇప్పుడు ఆస్తుల పంచాయితీ వచ్చిందని నారాయణ ఆరోపించారు. జగన్ అక్రమస్తుల కేసును మోదీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. అప్పుడు అన్నా చెల్లెళ్ల పంచాయితీ కూడా తేలిపోతుందని చెప్పారు. 11 ఏళ్ల నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారని నారాయణ గుర్తుచేశారు. ఆయన కోర్టుకు కూడా వెళ్లడం లేదని విమర్శించారు. మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్లుగా జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు.


రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ

ఆస్తుల వాటా విషయంలో వైఎస్ షర్మిలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కుటుంబ ఆస్తుల వివాదం కాస్తా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు.. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి కారణం అయింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలు కూడా పరస్పరం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నారు. వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తుండగా.. అంతే స్థాయిలో కాంగ్రెస్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వంపై షర్మిల సంచలన ట్వీట్!

కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. X ఖాతాలో సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక వైపు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ.. మరోవైపు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వాతలు పెడుతోందని మండిపడ్డారు. "ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ సెటైర్లు వేశారు. దీపం పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. కరెంటు బిల్లుల రూపంలో వసూలు చేసేది రూ.6 వేల కోట్లు అన్నారు.

షర్మిలకు అండగా పవన్ కల్యాణ్

జగన్ సోదరి షర్మిలకు రక్షణ కల్పిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. షర్మిల.. తన ప్రాణాలకు రక్షణ కావాలని, అదనంగా సెక్యూరిటీ కల్పించాలని అడిగారని తెలిపారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందన్నారు. ఓ బాధ్యత గల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చని.. మీరు అప్పీల్ చేసుకోండి. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

Tags

Next Story