Crime: దారి కాచి.. కత్తులతో పొడిచి

Crime: దారి కాచి.. కత్తులతో పొడిచి
మైనింగ్‌ గొడవలతో గనుల యజమాని హత్య

కర్నూలు జిల్లాలో ఓ మంత్రి ఇలాకాలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతుంది. మైనింగ్‌ గొడవలతో గనుల యజమానిని దారి కాచి కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. గనుల్లో అక్రమాలు బయటపెట్టినందుకే చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుసార్లు అక్రమ మైనింగ్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు మృతుడు. ఈ నేపధ్యంలోనే తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె దగ్గర శ్రీనివాసులు అనే మైన్‌ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు, శ్రీను బుధవారం మధ్యాహ్నం టూవీలర్‌ పై వెళ్తుండగా దారిలో కాపుకాచిన కొందరు వ్యక్తులు రోకలిబండలతో దాడి చేసి కత్తులతో హత్య చేశారు. శ్రీనివాస్‌ కొద్దికాలం క్రితం డోన్‌ నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్‌పై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ కారణంగానే ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక రెండు నెలల క్రితం తనకు ప్రాణహాని ఉందని తన తండ్రి డోన్‌ డీఎస్పీకి ఫోన్‌ చేసి రక్షణ కల్పించాలని కోరాడని అయినా పోలీసులు పట్టించుకోలేదని శ్రీనివాసులు కుమారుడు ఆరోపించాడు. అయితే శ్రీనివాసులును పథకం ప్రకారమే హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. మైనింగ్‌ గొడవలకు సంబంధించిన వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొచ్చెర్వు గ్రామంలో లద్దగిరి శ్రీనుతో మైనింగ్‌ గొడవలు ఉన్న ఓ కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story