TTD : తిరుమలలో కరెంటు బుకింగ్ సేవా టిక్కెట్ల కౌంటర్ ప్రారంభం

TTD : తిరుమలలో కరెంటు బుకింగ్ సేవా టిక్కెట్ల కౌంటర్ ని టీటీడీ ప్రారంభించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ల విరామం తరువాత ప్రారంభం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల సీఆర్‌వో జనరల్ కౌంటర్లలో కరెంట్ బుకింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఆర్జిత సేవా టికెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ కౌంటర్లలో టికెట్ తీసుకుంటే రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు ఇస్తారు. ఒక స్లిప్ లో భక్తుని నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్‌లు నమోదు చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ ర్యాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా లక్కీ డిప్ తీస్తారు.
లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ కు రాత్రి 11 లోపు సమాచారం వస్తుంది. టికెట్లు పొందని వారికి కూడా సమాచారం అందిస్తారు. లక్కీ డిప్ విధానంలో టికెట్లను ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలు చేస్తుంది. ఈ విధానంలో ఆర్జిత సేవ పొందిన భక్తులు ఆరు నెలల వరకు మరే ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతి ఉండదు. ఆర్జిత సేవల నమోదు కోసం ఆధార్ తప్పనిసరి ఉండాలి. ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్ట్ ఉండాలి. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతో కౌంటర్ వద్దకు తీసుకెళ్లారు.
ఇక లక్కీడిప్ తో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం ఆహ్వాన పత్రిక, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్లు కేటాయిస్తారు. అయితే వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.. ఇన్ని రోజుల తర్వాత స్వామివారి సేవ కోసం లక్కీడిప్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కలగడంతో.. భక్తులు సంతోషం వ్వక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com