CRIME: సైబర్ వలలో టీడీపీ ఎమ్మెల్యే.. రూ.1.07 కోట్లు సమర్పణ!

డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ఎంతకు తెగిస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. కేటుగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆయన నుంచి భారీగా డబ్బును కాజేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేని భయపెట్టారు. . ఏవేవో కేసుల పేరుతో భయపెట్టడంతో రూ.1.07 కోట్లను సైబర్ నేరగాళ్లకు గుట్టుచప్పుడు కాకుండా సమర్పించుకున్నాడు. ఆ తర్వాత మోసపోయానని గుర్తించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన పరిస్థితి తయారైంది. లబోదిబోమంటూ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. పుట్టా సుధాకర్ యాదవ్ పెద్దగా చదువుకోలేదు. అయితే కష్టపడి అంచెలంచెలుగా ఆర్థికగా ఎదిగారు. మాజీ మంత్రి యనమత రామకృష్ణుడితో వియ్యం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ సభ్యుడు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన కుటుంబం నివాసం వుంటోంది. ఈ నెల 10న పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఫోన్‌కాల్ వెళ్లింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఇటీవల ఉగ్రవాదిని అరెస్ట్ చేశామని చెప్పాడు. ఆ ఉగ్రవాది బ్యాంక్ ఖాతా నుంచి మీ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రాలేవో పుట్టాకు చూపాడు. సీబీఐ వారెంట్‌తో భయపెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొకడు సైబర్ అధికారినంటూ వీడియో కాల్ చేశాడు. మీ ఖాతాకు రూ.3 కోట్లు బదిలీ అయ్యిందని, కేసు విచారణ నిమిత్తం ముంబయ్‌కి రావాలని బెదిరించాడు. దర్యాప్తునకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో సుధాకర్ యాదవ్‌లో భయం మొదలైంది. తన ఖాతాకు ఉగ్రవాది నుంచి డబ్బు బదిలీ అయ్యిందా? లేదా? అని చూసుకోలేదు. సైబర్ నేరగాళ్లకు రూ.1.07 కోట్లు అప్పనంగా సమర్పించుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com