AP Rains: ఒకేసారి మూడు తుఫాన్లు..రాష్ట్రానికి భారీ వర్ష సూచన

నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టం నుంచి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడు కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిడుగులాంటి వార్తను చెప్పింది.
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబరు నెలలో రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయని, వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ నెలలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాన్ల ప్రభావంతో అక్టోబరు 10 తర్వాత కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. కావలిలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదైంది. విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com