RAINS: రెండు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేటి నుంచి తుఫాన్‌గా బలపడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడింది. ఈ వాయుగుండం పారాదీప్‌కి ఆగ్నేయంగా 700 కి.మీ దూరములో సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా 750 కి.మీ దూరంలో దక్షిణ- ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. బలపడిన వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తీవ్ర తుపానుగా..
ఆ తర్వాత తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడనుంది. అక్టోబర్ 24న రాత్రి లేకపోతే అక్టోబర్ 25న ఉదయంగానీ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరమైన పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దానా తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
‘దానా’ తుఫాన్ ప్రభావంతో ఈనెల 23, 24, 25 తేదీలలో ఈస్ట్-కోస్ట్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 23వ తేదీన 18 రైళ్లు, 24వ తేదీన 37 రైళ్లు, 25వ తేదీన 11 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. క్యాన్సిలైన రైళ్లలో.. కన్యాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్, సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com