AP : తీవ్ర తుపానుగా మారిన దానా.. ఉత్తరాంధ్రలో హైఅలర్ట్

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపానుగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పరదీప్‌కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను కేంద్రీ కృతమైంది. అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉంది. ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీవ్రతుపాను ప్రభావంతో ని తీర ప్రాంతం వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి. గరిష్ఠంగా 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది.వాడరేవు, కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో.. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరం వెంబడి గురువారం రాత్రి వరకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో, ఇవాళ రాత్రి నుంచి 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్రన్ రైల్వే సీల్దా డివిజన్‌లో ఇవాళ రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య 190 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 200 రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా దారిమళ్లించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com