Srikakulam : ఇవాళ తీరం దాటనున్న వాయుగుండం.. శ్రీకాకుళం జిల్లాలో హైఅలర్ట్

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్యంగా కదిలి తీరం దాటనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయుగుండం ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలో అప్రమత్తత
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా అధికారులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సహాయక చర్యల కోసం జిల్లా కలెక్టరేట్‌లో 08942 240557 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com