AP : ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న పెనుముప్పు

AP : ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న పెనుముప్పు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలోని తీర ప్రాంత జిల్లాకు పెను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. రేపు ఉదయానికి నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరే అవకాశం ఉంది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని.. ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడవచ్చని అంచనాలు వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, సత్యసాయి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఉదయం గంటలోనే 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. భారీ వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

పెను గండం ముంచుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను ముంపు ప్రాంతాలకు పంపించింది. చెరువులు, వంతెనల దగ్గర పోలీసులను పెట్టారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపు జనాలు వెళ్లకుండా చూస్తున్నారు. రెడ్ అలర్ట్ విధించిన జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags

Next Story