వైఎస్ వివేకా హత్యకేసులో శంకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. హైదరాబాద్ లో అతన్ని అరెస్ట్ చేసి పులివెందులకు తీసుకువచ్చిన సీబీఐ... వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. . శివశంకర్ రెడ్డికి పులివెందుల కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. డిసెంబర్ రెండో తేదీ వరకు అతను రిమాండ్‌లో ఉంటారు. కాగా శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల కోర్టుకు వచ్చారు.
వివేకా హత్యకేసు నింధుతుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి... సబీఐ డైరెక్టర్‌కు లేఖరాశారు. వైఎస్ వివేకా హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని విజ్ఞప్తిచేశారు. వివేకా హత్య వెనుక చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వర్‌రావు, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిల కుట్రకోణంపై విచారణ చేయాలన్నారు. వివేకా హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, హత్యవిషయం తరువాతి రోజు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేసిన సిట్ విచారణకు సహకరించానని, ఈ కేసు సీబీఐకు అప్పగించిన తర్వాత కూడా మూడుసార్లు విచారణకు హాజరయినట్లు తెలిపారు.
వైఎస్ వివేకా హత్యకేసును టేకప్ చేసిన సీబీఐ వేగంగా విచారణ చేపడుతోంది. వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. మరిన్ని అరెస్టులకు సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com