AP BJP New Chief: పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం

AP BJP New Chief: పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం
అనుభవం, వాక్చాతుర్యమే కారణం

పురందేశ్వరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది భారతీయ జనతా పార్టీ. అధ్యక్ష పదవి రేసులో రకరకాల పేర్లు వినిపించినా చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది. ఏపీ చీఫ్‌గా సోము వీర్రాజు ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో ఆ బాధ్యతలను కొత్త నాయ‌క‌త్వానికి అప్ప‌గించింది బీజేపీ అధిష్టానం.




ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వ‌రిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. బీజేపీలో అంద‌రికీ ఆమోదం ఉన్న నాయకురాలామె. మాటల్ని సూటిగా, పొదుపుగా వాడుతూ, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండే మహిళా నేతగా ఆమెకు పేరుంది. విధాన‌ప‌ర‌మైన చ‌ర్చ‌కు ప్రాధాన్యం ఇచ్చే పురందేశ్వరి స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె .1959 ఏప్రిల్‌ 22న చెన్నైలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ తో రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి. 2004లో బాపట్ల నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2009లో బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ కావడంతో విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మన్మోహన్ హయాంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు.




అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి దూరం అయ్యారు. పార్టీ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లోబీజేపీలో చేరారు. ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జిగా, ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమించి గౌరవించింది. ఇప్పుడు తాజాగా రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం లో సామాజిక సమీకరణాలు సైతం పరిగణలోకి తీసుకుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, వివాదాలకు దూరంగా ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం దగ్గుబాటి పురంధేశ్వరికి అనుకూలంగా మారాయి. మహిళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం భావించి ఉండవచ్చు.




అంతే కాదు గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పురందేశ్వరి తన అభిప్రాయాలు నిష్కర్ష గా తెలిపారు. ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసింది. ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, హుందాతనం, ప్రసంగాలలో చిన్నపాటి ఉద్రేకం వంటి కారణాల వల్ల ఆమె దక్షిణాది సుష్మా స్వరాజ్ గా పేరు పొందారు.





Tags

Read MoreRead Less
Next Story