Deputy CM Pawan Kalyan: ఏలేరు వరద ఉధృతిపై కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఫోన్..

ఏలేరు వరద ఉద్ధృతిపై కాకినాడ కలెక్టర్, అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిపై ఫోనులో వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. గండ్లు పడి రోడ్లపై నీటి చేరికతో రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. ఏలేరు వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని డిప్యూటీ సీఎంకు కలెక్టర్ వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, పాలు అందించాలని పవన్ ఆదేశించారు.
ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఈ రోజు ఉదయం ఫోన్ ద్వారా వరద పరిస్థితిపై చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.
ఇక, ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని డిప్యూటీ సీఎంకు వివరించారు కలెక్టర్. ఈ రోజు ఉదయం 8 గంటలకి 12,567 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీలుగా ఉందని వివరించారు. నాలుగు గేట్లు ఎత్తినట్లు చెప్పారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తూ ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. దళాలతోపాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని స్పష్టం చేశారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com