Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై మరోసారి దేవాదాయశాఖ విచారణ

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై మరోసారి దేవాదాయశాఖ విచారణ
పాత సమస్యలు కప్పేందుకేనా

సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి దేవాదాయశాఖ విచారణ జరపనుంది. ఆలయ నిర్వహణ, కొనుగోలు, విక్రయాల్లో... అవకతవకలు జరిగాయంటూ 2021లోనే అవినీతి నిరోధక శాఖ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అప్పట్లో 14మంది సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈవోను బదిలీ చేశారు. తాజాగా మళ్లీ ఇదే అంశాలపై విచారణకు... దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అక్రమానికి సక్రమ ముద్ర వేసేందుకేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2021 ఫిబ్రవరి 18న విజయవాడ దుర్గగుడిలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను గుర్తించారు. వీటిపై సమగ్ర నివేదికను అప్పుడే రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్.... ప్రభుత్వానికి అందజేశారు. వీటి ఆధారంగా దుర్గగుడికి సంబంధించిన 14 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసి..., అప్పటి ఈవో సురేష్‌బాబుపై బదిలీ వేటు వేశారు. ఆ తర్వాత శాఖాపరమైన విచారణ నిర్వహించారు. అవకతవకలు జరిగాయని నిర్ధరించిన విచారణాధికారి ఓ నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు అందజేశారు. ఆ రెండు నివేదికల ఆధారంగా E.O.పై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అధికార పార్టీకి చెందిన నేతల ఆశీస్సులుండడం వల్ల... ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. పెండింగ్‌లో పెట్టేశారు.

తాజాగా మరోసారి ఇవే అక్రమాలపై విచారణకు ఆదేశిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండున్నరేళ్ల కిందటే పూర్తిగా విచారణ చేసి నివేదికలు సమర్పించినా..... వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారు. మళ్లీ ఇప్పుడు విచారణ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి ఈవో సురేష్‌బాబు వచ్చే ఏడాది జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మళ్లీ విచారణ చేయించి.. బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

దుర్గగుడిలో అక్రమాలపై ఇచ్చిన నివేదిక ఆధారంగా 14మంది సిబ్బందిపై వేటు వేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించిన కీలకమైన 14 అవకతవకల్లో ఆలయ ఈవో సురేష్‌బాబు పాత్ర కూడా ఉన్నట్లు అవినీతి నిరోధకశాఖ నివేదికలో పొందుపరిచారు.

కానీ కేవలం కిందిస్థాయి సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. అప్పటి మంత్రి, స్థానిక M.L.A. అండదండలు ఉండడంతో... ఈవోను కేవలం బదిలీ చేసి వదిలేశారు. చర్యలు తీసుకున్న సిబ్బంది అంతా సూపరింటెండెంట్, గుమస్తా స్థాయి వాళ్లే. వారిపైన ఉండే ఏఈవో, ఈవోల అనుమతి లేకుండా.... చిన్న రశీదు కూడా కదిలేందుకు వీలుండదు. ఆలయంలోని ప్రధానమైన శానిటేషన్, సెక్యూరిటీ టెండర్లు, సరకుల్లో అవకతవకలు, చీరల విభాగంలోని అక్రమాలను ఆధారాలతో సహా అధికారులు నివేదికలో పొందుపరిచారు. అయినా.. పైస్థాయి అధికారులు ఎవరిపైనా చర్యలు లేవు.

దుర్గగుడిలో 2021లో గుర్తించిన అక్రమాలపై ఈనెల 14న మళ్లీ విచారణ చేయనున్నారు. ఈసారి విచారణాధికారిగా అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి చంద్రకుమార్‌ను నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి EO సురేష్‌బాబు, మరో 18మంది కిందిస్థాయి సిబ్బందిని విచారణ చేయనున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో 14వ తేదీన ఉదయం 11గంటలకు హాజరుకావాలంటూ వీరందరికీ ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story