Glucose Test: షుగర్ టెస్టుకు కొత్త పరికరం .. చెమటతోనే పరీక్ష

చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయులను చెప్పే ఓ కొత్త పరికరాన్ని ఏపీకి చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు కనుగొన్నారు. ఆయనకు ఇటీవల కేంద్రం ఈ పరికరంపై పేటెంట్ హక్కులు జారీ చేసింది. సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు. ఫలితంగా ఈ పరికరం చిన్నారులకు, పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందని డా.శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 29న ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇస్తూ ధ్రువపత్రం జారీ చేసింది.
తాను రూపొందించిన పరికరాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజాగా పేటెంట్ హక్కులు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరికరాన్ని రూపొందించేందుకు తాను నాలుగేళ్ల పాటు కష్టపడ్డట్టు ఆయన చెప్పారు. ఇది మార్కెట్‌లోకి వస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టైప్ 1 మధుమేహం బారిన పడుతున్న వారు రోజుకు నాలుగు సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. టైప్-2 మధుమేహ బాధితులూ తరచూ షుగర్ టెస్టు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాసరావు ఈ ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొన్నారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన డా.శ్రీనివాస రావు నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విద్యాభ్యాసం పూర్తి చేశారు. జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు.
డయాబెటిస్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిని పట్టి పీడిస్తోంది. మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) అధిక స్థాయిలో ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. ప్యాంక్రియాస్ ద్వారా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం వల్ల ఇది జరగవచ్చు. ఇన్సులిన్ అనేది శక్తి కోసం కణాలలోకి గ్లూకోజ్‌ను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్. షుగర్ పరీక్షలు, ప్రత్యేకంగా రక్తంలో గ్లూకోజ్ పరీక్షలను సూచిస్తాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (FBS), పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ షుగర్ టెస్ట్ (PPBS), రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (RBS), ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (OGTT), HbA1c పరీక్ష ద్వారా షుగర్ టెస్ట్‌లు చేస్తుంటారు. అయితే ఇవి ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఈ పరికరం ద్వారా వీటితో సంబంధం లేకుండా కేవలం చెమట(Sweat)తోనే ఇక్‌పై షుగర్ టెస్టు చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com