RGV : ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ

RGV :  ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ
RGV : ఏపీలో జరుగుతున్న సినిమా టికెట్ల వివాదంపై పది పదునైన ప్రశ్నలు సంధించారు రాంగోపాల్‌వర్మ.

RGV : ఏపీలో జరుగుతున్న సినిమా టికెట్ల వివాదంపై పది పదునైన ప్రశ్నలు సంధించారు రాంగోపాల్‌వర్మ. గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు. సినిమా అనేది ప్రేక్షకుడికి సినిమా నిర్మాణం చేసినవారికి మధ్య వ్యవహారం అని.. దాంట్లో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

ప్రొడక్షన్‌ కాస్ట్‌ ఆధారంగా సినిమా క్వాలిటీ ఆధారపడి ఉంటుందన్న ఆర్జీవీ.. దాని బడ్జెట్‌ను మీరు ఎలా నిరోధిస్తారు.? అని ప్రశ్నించారు. తక్కువ ధరతో తయారైంది తక్కువ క్వాలిటీ ఉన్నట్టే.. ఎక్కువ ఖర్చుపెట్టి తీసింది ఎక్కువ క్వాలిటీ ఉంటుందని ఆర్జీవీ అన్నారు. ఇంతకే తీయాలి.. ఇంతకే అమ్మాలి.. అని మీరెలా నిర్ణయిస్తారని ఆర్జీవి ప్రశ్నించారు.

పేదల మీద అంత ప్రేమ ఉంటే.. ఎన్నో రంగాల్లో సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం.. సినిమా టికెట్లపైనా సబ్సిడీ ఇవ్వొచ్చు కదా అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఆ విధంగా చేసిన పేదల మీద మీకున్న ప్రేమను చూపించొచ్చుకదా.? అని కౌంటర్‌ వేశారు.

ధరలు నిర్ణయిస్తున్న ప్రభుత్వం.. అసలు సినిమాలే ప్రభుత్వం కొనేయొచ్చు కదా అని ఆర్జీవీ ప్రశ్నించారు. సినిమాలు కొనేసి ఇష్టమొచ్చిన రేట్లకు టికెట్లు అమ్మితే ఎవరికీ నష్టం ఉండదు కదా అని నిలదీశారు.

సినిమా టికెట్లు మొత్తం అయినా.. లేక టికెట్లలో సగం అయినా ప్రభుత్వమే కొనేస్తే అసలు సమస్య ఉండదు అన్నారు ఆర్జీవీ. అలా కొన్న టికెట్లు పేదలకు తక్కువ ధరలకు అమ్మితే.. సినిమా వాళ్లకు వాళ్ల డబ్బులు వస్తాయి.. ప్రభుత్వానికి ఓట్లు వస్తాయని ఆర్జీవీ మార్క్‌ సలహా ఇచ్చారు.

హీరోల రెమ్యురేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మంత్రులకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఆర్జీవీ. మహేశ్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ కోసమే ఫ్యాన్స్‌ సినిమాలు చూస్తున్నారని.. అలాంటప్పుడు వాళ్లు ఇంతే తీసుకోవాలని అనడం ఏంటి.? అని ఆయన ప్రశ్నించారు. పెద్ద హీరోల సినిమాలకే బడ్జెట్‌, రాబడి కూడా ఎక్కువగా ఉంటుందని అది వారి స్టామినా అని అన్నారు.

టమోటా నచ్చకపోతే వెనక్కి ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు.. సినిమా నచ్చకపోతే వెనక్కి డబ్బులు ఇస్తారా.? అన్న ఏపీ మంత్రుల కామెంట్స్‌కు అదే రేంజ్‌లో అటాక్‌ ఇచ్చారు ఆర్జీవీ. ఎన్నోహామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు.. ఇప్పుడు అవి నెరవేర్చడం లేదు.. మీ ప్రభుత్వం నాకు నచ్చలేదు అంటే మీరు అధికారం వదిలేస్తారా.? అని ఆర్జీవీ ప్రశ్నించారు.

పెద్ద హీరోలను టార్గెట్‌ చేయడంపై సెటెర్లు వేశారు ఆర్జీవీ. అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు లాంటి హీరోలకు పోటీగా మీరే హీరోలను పెట్టి సినిమాలు తీసేయొచ్చుకదా.? ఇష్టమొచ్చినట్లు రేట్లకు సినిమాలను అమ్మి.. ప్రేక్షకులను సంతృప్తి పరచొచ్చు కదా.? అని ప్రశ్నించారు.

ప్రభుత్వంలో అధికారులకు ఒక జీతం.. ఫ్యూన్‌కి ఒక జీతం ఉన్నప్పుడు.. సినిమా వాళ్లు మాత్రం ఇలానే తీసుకోవాలని చెప్పడమేంటి.? అని ప్రశ్నించారు ఆర్జీవీ. సినిమా కోసం వెయ్యి మంది కష్టపడితే ఎవరి స్థాయికొద్ది వాళ్లు దాని ఆదాయాన్ని షేర్‌ చేసుకుంటారు అని.. మీరు ఇంతే తీసుకోవాలని మీరెలా చెబుతారని ఆయన నిలదీశారు.

చిన్న హోటల్‌లో ఇడ్లీ ఒక రేటు ఉంటుంది.. పెద్ద హోటల్‌లో ఒక రేటు ఉంటుంది.. నువ్వు ఇంత రేటుకే ఇడ్లీ అమ్మాలి అని ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు ఆర్జీవీ. మరీ అక్కడ లేని అధికారం.. సినిమా టికెట్ల రేట్లలో ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన అడిగారు.

Tags

Read MoreRead Less
Next Story