ycp : వైసీపీ పై మండిపడుతున్న దివ్యాంగులు

ycp : వైసీపీ పై మండిపడుతున్న  దివ్యాంగులు
పధకాలు అమలు చేయలేదంటూ విమర్శలు

అన్ని వర్గాల వారినీ మోసం చేసిన వైకాపా ప్రభుత్వం అండగా నిలవాల్సిన దివ్యాంగులకూ మొండిచేయినే చూపింది. ఎన్నికలకు ముందు వారికి ఇచ్చిన హామీలనూ... తుంగలో తొక్కింది. గత ప్రభుత్వ హయాంలో ఫించన్ల పెంపు, 3చక్రాల వాహనాల అందజేత వంటి పథకాలు అమలు చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక చాలా మంది దివ్యాంగులకు వివిధ షరతులు పెట్టి.... ఆసరా పింఛన్‌లోనూ కోత విధించారని వాపోతున్నారు.

స్వయం కృషితో ఎదగాలని అనేక మంది దివ్యాంగులు అనుకున్నా ఆర్థికంగా వారి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటోంది. చాలా మంది ఉండడానికి ఇళ్లు లేక అవస్థలు పడుతున్నారు. చాలీచాలని పింఛన్లతో ఇంటి అద్దె కట్టి జీవనాన్ని సాగించలేని పరిస్థితిలో బతుకెళ్లదీస్తున్నారు. అంగవైకల్యం పేరుతో చాలామంది దివ్యాంగులకు వివాహాలు జరగడం లేదు. అలాంటి వాళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా జీవించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు అందించాల్సి ఉంటే... పూర్తిస్థాయిలో ఈ రిజర్వేషన్లు అమలు జరగడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఉంటే ఆ ఇంట్లో ఉండే దివ్యాంగునికి పింఛన్‌లో కోత విధిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తి... దివ్యాంగునికి ఆసరాగా నిలబడతారనే నమ్మకం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత వివిధ షరతులు పెట్టి పింఛన్లలో కోత విధించింది. గత ప్రభుత్వాలు అందించే 3 చక్రాల వాహనాలనూ... జగన్ సర్కార్ నిలిపివేసిందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. అవసరమైన వారికి రుణాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story