Water Problems: ప్రభుత్వానికి కనపడని అనంత కష్టాలు

Water Problems: ప్రభుత్వానికి కనపడని అనంత కష్టాలు
వేసవి వస్తే గొంతెండాల్సిందే..!

నేను విన్నాను నేనున్నాను అని బీరాలు పలికే ముఖ్యమంత్రి జగన్‌కు అనంతవాసుల దాహం కేకలు మాత్రం వినపడటం లేదు. తాగేందుకు గుక్కెడు నీరు రాక ప్రజలు అల్లాడుతుంటే సర్కార్‌ చోద్యం చూస్తోంది. సమస్యను పరిష్కరించాలని స్వయానా సొంత పార్టీ కార్పొరేటర్లే కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకున్న నాథుడే లేరు. సర్కార్‌ మొండి వైఖరితో విసిగివేసారిన నేతలు, ప్రజలు ఖాళీ బిందెలతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో మహిళలతో కలిసి వైకాపా కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఖాళీ బిందెలతో కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. నగర మేయర్‌ సహా మున్సిపల్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల బడ్జెట్‌ ఉండే నగరపాలక సంస్థ... రెండు మోటర్లు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. పాలక వ్యవస్థకు దొంగ బిల్లులు పెట్టి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ... ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కమిషనర్‌ చాంబర్‌ను ముట్టడించారు. కమిషనర్‌ మేఘస్వరూ్‌పకు సమస్యను వివరించారు. మోటార్ల మరమ్మతుకు పది రోజుల సమయం పడుతుందని, వచ్చే నెల పదో తేదీలోగా సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆ తరువాత కాసేపటికి మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పదో తేదీలోగా నీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

అనంతపురం నగరానికి నీటిని పంపిణీ చేసే PABR జలాశయంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలక పక్షం నేతలు, నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల నుంచి తీవ్ర నీటి ఎద్ద డితో అల్లాడుతున్నామని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఓట్లతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story