AP: దేశంలోనే పెద్ద ఈవెంట్‌గా "అమరావతి డ్రోన్ షో"

అమరావతిలో భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్ హ్యాకథాన్ జరగనుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు. 9 థీమ్స్ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్ హాజరవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆకృతులనూ ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ కూడా దీనిలో ఒక అంశంగా ఉండబోతోంది. .
మొన్నటి విజయవాడ వరదల సందర్భంలోనూ సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించారు. సహాయక బృందాలు సైతం చేరుకోలేని పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, మందులు సహా అనేక రకాలుగా సహాయం అందించారు. వరదల తర్వాత కూడా డ్రోన్లను ఉపయోగించి సేవలు అందించారు. అలాగే వ్యవసాయ రంగంలో డ్రోన్లను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మారుమూల ప్రాంతాలకు అత్యవసరంగా మెడిసిన్ అందించాలంటే డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది. లేటెస్టుగా చెన్నైలో వరదల సందర్భంగా పరిస్థితిని సమీక్షించడానికి, ముంపు తీవ్రతలను తెలుసుకోవడానికి కూడా డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది.
పౌరసేవల కోసం..
సైన్యం, వ్యూహాత్మక అవసరాల ఉపయోగానికే పరిమితమైన డ్రోన్లను పౌరసేవల కోసం విస్తృత స్థాయిలో ఉపయోగించేలా విధాన రూపకల్పన చేసేందుకే అమరావతిలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్ శ్రీవాత్సవ, ఏపీ ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రకటించారు. కేంద్ర పౌర విమానయానశాఖతో కలిసి ఏపీ ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్ నిర్వహించబోతున్న తరుణంలో అధికారులు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిసి వివరాలు అందించారు. ‘దేశంలో డ్రోన్ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని పీయూష్ శ్రీవాత్సవ వెల్లడించారు, డ్రోన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com