Eagle Team : ఏపీ, తెలంగాణలో డ్రగ్స్ కలకలం: ఈగల్ టీమ్ దాడులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన 'ఈగల్ టీమ్' ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లాలోని పెనమలూరు వద్ద ఈగల్ టీమ్ నిర్వహించిన తనిఖీల్లో రెండు గ్రాముల కొకైన్ లభ్యమైంది. కొకైన్ సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూలాలపై దృష్టి పెట్టింది.
కాగా ఇటీవల మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లోని చర్లపల్లి వాసవి ల్యాబ్స్‌లో ఒక భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ రాకెట్‌కు ముడిసరుకు గురుగ్రామ్ నుంచి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఏయే రాష్ట్రాల నుంచి ముడిసరుకు సరఫరా అవుతుందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో విస్తుపోయే విషయం ఏమిటంటే, ఈ ల్యాబ్స్‌లో కూలీలుగా పనిచేసిన వారిలో ఒక కానిస్టేబుల్ కూడా ఉండటం అందరినీ షాక్ కు గురిచేసింది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా, తయారీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com