ED: జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు

ED: జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు
X
దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులు జప్తు... రూ.793 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

దశాబ్దకాలంగా న్యాయప్రక్రియలో ఆలస్యమవుతూ ముందుకు సాగుతున్నమాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు మరింత ఊపందుకుంటోంది. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి, దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. గతంలో సీబీఐ చార్జిషీట్ ఆధారంగా జరిగిన మనీ లాండరింగ్‌ను పక్కాగా ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారం కడప జిల్లాలోని సున్నపురాయి గనుల లీజులకు సంబంధించినది. 2009లో వైఎస్‌ఆర్ హయాంలో దాల్మియా సిమెంట్స్‌కి సుమారు 417 హెక్టార్ల గనులను లీజుగా మంజూరు చేశారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయని సీబీఐ అనుమానంతో 2013లో చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆధారాలపై ఈడీ కూడా దర్యాప్తును ప్రారంభించింది. మనీ లాండరింగ్ నిరూపణకు సంబంధించి ప్రస్తుతం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టినవారిపై దర్యాప్తు జరిపింది ఈడీ. సున్నపు రాయి గనుల లీజులో ఆయాచితి లబ్ది పొందిన వారి ఆస్తులను కూడా జప్తు చేసింది. పునీత్ దాల్మియాకు, విజయసాయి రెడ్డికి మధ్య డీల్ కుదిరిందన్న విషయాన్ని సీబీఐ చెప్పింది.

జగన్ లబ్ధి పొందారన్న ఈడీ

ఈ కేసులో జగన్ రూ.150 కోట్ల లబ్ధి పొందారని ఈడీ నిర్దేశించింది. ఇందులో రూ.95 కోట్లు రఘురాం సిమెంట్స్ షేర్ల రూపంలో, రూ.55 కోట్లు హవాలా మార్గంలో స్వీకరించారని తేల్చింది.రఘురాం సిమెంట్స్, తర్వాత భారతి సిమెంట్స్‌గా మారింది. ఈ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ బహిరంగమవుతున్న నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ తరఫున పలు పిటిషన్లు వేయడం వల్ల కేసు విచారణ ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు ఈడీ సీరియస్‌గా వ్యవహరించడంతో కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ త్వరపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన పాసిఫామ్‌కు వాటాలో కొంత భాగాన్ని దాల్మియా అమ్మింది. వచ్చిన సొమ్ములో రూ.55 కోట్లు జగన్‌కు బదిలీ చేశారని సీబీఐ అభియోగాలను మోపింది.

రూ.55 కోట్లు జగన్ ఖాతాలోకి

మొత్తం దాల్మియా సిమెంట్స్‌కు వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా మార్గంలో జేఆర్‌ ఖాతాలోకి పంపగా మిగతా డబ్బు కూడా మళ్లించేలోపే సీబీఐ దర్యాప్తు మొదలవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ‘జేఆర్‌’ ఖాతాలోకి రూ.55 కోట్లు చెల్లించినట్లు ఉంది. జేఆర్‌ అంటే జగన్‌మోహన్‌రెడ్డి అని దర్యాప్తు సంస్థలు భావించాయి. సున్నపురాయి గనుల కేటాయింపు, భారతి సిమెంట్స్‌లో దాల్మియా పెట్టుబడి పెట్టడం, తమ వాటా అమ్మగా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వంటివన్నీ నిధుల మళ్లింపు కిందికే వస్తాయనే అభియోగంపై దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Tags

Next Story