Editorial: కర్నూలు జిల్లా వైసీపీలో కుమ్ములాటలు

Editorial: కర్నూలు జిల్లా వైసీపీలో కుమ్ములాటలు
టిక్కెట్ కోసం ఇప్పటినుంచే నేతల పాట్లు; మంత్రాలయం, ఎమ్మిగనూర్ ఎమ్మెల్యేల ఫీట్లు; వారసులను దింపేలా అధిష్టానం వద్ద పావులు; కొత్తవాళ్లు అనేసరికి జంకుతున్న జగన్......


రాయలసీమకే ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకునేందుకు చేస్తున్న యత్నాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓపక్క ముంచుకొస్తున్న ఎన్నికలు... ఇంకోపక్క సైకిల్ స్పీడు..మరోవైపు వారసుల టికెట్ గోల వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు వారసులకి టికెట్లు ఎందుకు అడుగుతున్నారు. ఈ ఒక్కసారికి వాళ్లే పోటీలో ఉండొచ్చు కదా అన్నదానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

మంత్రాలయం విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న సీతారామిరెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డిని రాజకీయ వారసునిగా పరిచయం చేస్తూ మంత్రాలయం నుంచి పోటీలో దించాలని చూస్తున్నారట. అయితే ప్రదీప్ రెడ్డినే ఎందుకు బరిలో దించాలని అనుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే... ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఆరోగ్యం బాగుండట్లేదు. దాంతో హైదరాబాద్ లోనే ఉంటూ... అప్పుడప్పుడూ మంత్రాలయంకి వచ్చి వెళ్తున్నారట. దీంతో అన్ని వ్యవహారాలూ ప్రదీప్ రెడ్డినే చూసుకుంటున్నారట. ఓ రకంగా చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే అనే టాక్ వినిపిస్తోంది. బాలనాగిరెడ్డి మంత్రాలయానికి పేరుకే ఎమ్మెల్యే... అన్నీ చక్కబెట్టేది ప్రదీప్ రెడ్డే.

ఇటు ఎమ్మిగనూర్ లో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉండనని.. తన స్థానంలో కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఉంటాడని ప్రకటించేశారు. వయోభారంతో బాధ పడుతున్నందున ఎన్నికల్లో పోటీ చేయలేనని అధినేతకు సైతం చెప్పేశాడట. మరి కేశవరెడ్డి కుమారుడు జగన్ కు టికెట్ ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుస్తాడా లేదా అన్నదానిపై వైసీపీ అధిష్టానం లోలోపల సర్వే చేపించినట్టు చర్చ జరుగుతోంది. సర్వేల్లో కూడా తమకు అనుకూల ఫలితాలు వచ్చాయని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చెప్పుకురావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే చెన్నకేశవరెడ్డి పోటీలో ఉండటం లేదని తెలియడంతో ఆ టిక్కెట్ పై మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కన్నేశారట. తన కుమారుడు ధరణీధర్రెడ్డిని ఎమ్మిగనూర్ నుంచి పోటీలో దించేందుకు యత్నిస్తున్నారట. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. మంత్రాలయం, ఎమ్మిగనూర్ రెండు టికెట్లు తమ వారసులకి ఇవ్వాలని కోరుతున్నారట. ఇటు ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వీరి సోదరుడే. ఒకే కుటుంబానికి మూడునాలుగు టికెట్లు ఎలా కేటాయించగలం అని వైసీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోందట. ఇంకోపక్క మాజీఎంపీ బుట్టా రేణుక కూడా ఎమ్మిగనూర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. పలుమార్లు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. అధిష్టానం టిక్కెట్ కేటాయిస్తే ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని బుట్టా రేణుక చెప్పుకొస్తున్నారు.

వయోభారం, అనారోగ్యంతో బాధ పడుతున్న సీనియర్లనే ఈ ఒక్కసారికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరుతుందా. లేక వారి వారసులకి టికెట్ లు కేటాయిస్తుందా. లేదా ఆ స్థానాల్లో ఇంకొకరికి అవకాశం కల్పిస్తుందా అన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఫ్యాన్ కి ఎదురు గాలి వీస్తోంది. సైకిల్ స్పీడ్ ఊహించని విధంగా పెరిగింది. చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు లక్షల్లో జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సీనియర్ సిట్టింగులకే కష్టకాలం నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తవాళ్లకు టికెట్లు కేటాయిస్తే.. ప్రతికూల ఫలితాలు తప్పవేమో అని వైసీపీ అధిష్టానంలో ఆందోళన మొదలైందట. దాంతో ప్రస్తుతానికి ఈ టికెట్ల అంశాన్ని పక్కన పెట్టిందట.కొద్దినెలలు చూసి పూర్తిస్థాయిలో సర్వేలు చేపించి, టీడీపీ అభ్యర్థులకి గట్టిపోటీ ఇవ్వగలడు అని ఫిక్స్ అయినప్పుడే టిక్కెట్లను ప్రకటించాలని చూస్తోందట.

Tags

Read MoreRead Less
Next Story