Editorial : సిక్కోలు తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్

Editorial : సిక్కోలు తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్
పంచాయితీలన్ని పక్కన పెట్టిన టీడీపీ నేతలు; ఒకేమాట, ఒకేబాట అంటూ ఐక్యంగా ముందుకు; నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వంపై పోరాటాలు; పార్టీకి పూర్వవైభవమే లక్ష్యంగా అడుగులు


టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్ధితి మాత్రం నాలుగు గ్రూపులు.. రెండు వర్గాలుగానే ఉండేది. కీలక నేతల ఆధిపత్య పోరులో కరుడుగట్టిన పసుపు క్యాడర్ నిత్యం నలిగిపోతూనే ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట. అనుభవాలు నేర్పించిన గుణపాఠాలో, లేక నేతల్లో వచ్చిన మార్పో తెలియదు కానీ, జిల్లా లీడర్లంతా పార్టీ కోసం పెడుతున్న ఎఫర్ట్స్ క్యాడర్ నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారం ఉంటేనే నాయకులం అనే సత్యాన్ని సిక్కోలు తెలుగు తమ్ముళ్లు ఆలస్యంగానైనా గ్రహించారనే చర్చ జరుగుతోంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి సిక్కోలు పసుపు పార్టీకి కంచుకోటగానే ఉండేది. బీసీలు అధికంగా ఉండే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అన్ని నియోజకవర్గాలనూ స్వీప్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎదురుగాలి గట్టిగానే వీచింది. పది అసెంబ్లీ స్థానాల్లో రెండింటికే పరిమితమయ్యింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సిక్కోలు టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓవైపు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, కూన రవికుమార్ వంటి కీలక నేతలు సైతం పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. ఇక క్యాడర్ పరిస్ధితి అయితే మరీ ఇబ్బందికరంగా మారింది. గ్రామాల్లో అధికార పార్టీ నేతల వేధింపులు తారాస్థాయికి చేరాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ క్యాడర్ తో పాటు లీడర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

పార్టీ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. నిరసనలు, ధర్నాల పేరుతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్యే కనిపించారు. దీంతో ఇన్నాళ్లూ నిశ్తేజంగా కనిపించిన టీడీపీ క్యాడర్ లో ఇపుడు కొత్త జోష్ కనిపిస్తోంది. దీనికితోడు ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్ గా బుద్దా వెంకన్న జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ తో కలిసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తరచూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు.

ఇటీవల శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, ముఖ్యనేతలంతా హాజరయ్యారు. సమావేశం మొత్తం సింగిల్ అజెండాతోనే సాగిందని సమాచారం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందరి అంతిమ లక్ష్యం టీడీపీని అధికారంలోకి తేవటమే అంటూ నేతలు ముక్తకంఠంతో నిర్ణయించారని తెలుస్తోంది. అటు జిల్లాలో ఎంతమంది నేతలు, కార్యకర్తలు పోలీసు కేసులతో ఇబ్బందులు పడుతున్నారు? క్షేత్ర స్ధాయిలో క్యాడర్ పడుతున్న ఇబ్బందులేంటి? ఎన్నికల వరకు క్యాడర్ దూకుడుగా వ్యవహరించటానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. దీంతో సిక్కోలు తెలుగు తమ్ముళ్లలో కొంత ఆత్మస్ధైర్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.

ఇక జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలంతా గతాన్ని మరచి ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్న ఫార్ములా అమలు చేస్తున్నట్లు క్యాడర్ చెబుతోంది. ఇదే స్పీడ్ తో ఇటు ముఖ్య నేతలు, అటు క్యాడర్ పనిచేస్తే సిక్కోలులో టీడీపీకి పూర్వ వైభవం ఖాయమనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.

Tags

Read MoreRead Less
Next Story