Editorial: "సైకిల్ ఎక్కబోతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి..?"

Editorial: సైకిల్ ఎక్కబోతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి..?
ఆసక్తికరంగా కర్నూలు రాజకీయం; మళ్లీ సొంత గూటికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి? అనుచరులు, క్యాడర్ నుంచి తీవ్ర ఒత్తిళ్లు; ఓపిగ్గా ఉండలాని సర్ది చెబుతున్న బైరెడ్డి; బీజేపీలోనే ఉంటాడా, టీడీపీలోకి వస్తాడా?


కర్నూలు జిల్లా రాజకీయాల విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బైరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయనో బ్రాండ్. అందుకు తగ్గట్టుగానే క్యాడర్, అనుచర వర్గం ఉంటుంది. కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నందికొట్కూర్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి.. తెలుగుదేశంలో సీనియర్ నేతగా రాణించారు. సొంత సెగ్మెంట్ నందికొట్కూర్ నుంచి 1994, 99 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నందికొట్కూర్ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో పాణ్యంకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేకూరాలని 2012లో టీడీపీని వీడారు. రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించి... సీమకు జరుగుతున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేశారు. తాను ఒక్కడిని సీమ వెనుకబాటు తనంపై పోరాడుతున్నా ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో పార్టీని మూసేశారు.

ఆ తర్వాత 2018 లో కాంగ్రెస్ లో చేరారు బైరెడ్డి. రాహుల్ గాంధీని కర్నూలుకి పిలిపించి పెద్ద సభ నిర్వహించారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసాన్ని కోల్పోయిందని 2019 ఎన్నికల ముందు బైరెడ్డి తిరిగి సైకిల్ ఎక్కేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలో ఎక్కడా ఆధిపత్య పోరు ఉండకూడదని బైరెడ్డిని, గౌరు వెంకటరెడ్డిలను కలిపారు. పాణ్యం టికెట్ గౌరు చరితా రెడ్డికి కేటాయించారు. ఇద్దరూ ఎన్నికల్లో కలిసే పనిచేశారు. అయితే జగన్ ఒక్క ఛాన్స్ నినాదం వర్క్ అవుట్ కావడంతో జిల్లా అంతా ఫ్యాన్ గాలి వీచింది. ఎన్నికల తర్వాత ప్రధాని మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమంటూ టీడీపీని వీడి కూతురు శబరితో బీజేపిలో చేరారు. ప్రస్తుతం రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ గా బైరెడ్డి, బీజేవైఎం రాష్ర్ట జనరల్ సెక్రటరీగా శబరి పనిచేస్తున్నారు. బీజేపీలో ఉంటున్నప్పటికీ కొంత కాలంగా మళ్లీ రాయలసీమ వెనుకబాటు తనంపై పోరాటం ఆరంభించారు. మేధావులు, ప్రజా సంఘాలను కలుపుకుని ఈ మధ్యే రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ర్టాలకు వెళ్లి పోతున్నాయి. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేవు. సీమ యువత పొట్ట కూటి కోసం పొరుగు రాష్ర్టాలకు వలస వెళ్లి పోతున్నారని.. బైరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం చిన్న సందర్భం దొరికినా జగన్ పై తనదైన స్టైలులో విమర్శలు చేస్తున్నారు. ఇదిలాగుంటే బైరెడ్డి మళ్లీ యూ టర్న్ తీసుకుంటున్నాడు అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో పాత గూటికి వచ్చే అవకాశాలున్నట్లు చర్చ జోరందుకుంది. అంటే సైకిల్ ఎక్కబోతున్నాడన్నది సొంత క్యాడర్ లోనే చర్చ సాగుతోంది. బైరెడ్డి తన అనుచర వర్గంతో సీమ హక్కుల కోసం సమావేశాలు నిర్వహిస్తే.. పెద్ద మొత్తంలో అనుచరవర్గం టీడిపిలోకి రావాలని బైరెడ్డిని కోరుతున్నారట. అధికార పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం.. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే రాష్ర్టం భాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్న విషయాన్ని అనుచరులు బైరెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. మళ్లీ సైకిల్ ఎక్కాలని కార్యకర్తలు, క్యాడర్ నుంచి బైరెడ్డికి ఒత్తిళ్లు చుట్టు ముట్టేస్తున్నాయట. ప్రస్తుతానికి ఈ అంశంపై బైరెడ్డి సైలెంట్ గా ఉన్నా... అనుచర వర్గానికి మాత్రం కొంచెం ఓపికతో ఉండండి అంతా మంచే జరుగుతుందని సర్ది చెబుతూ వస్తున్నారట.

ఇదే జరిగితే బైరెడ్డి నంద్యాల జిల్లా ఎంపీగా కానీ, పాణ్యం ఎమ్మెల్యే టికెట్ కానీ ఆశించే అవకాశాలున్నట్లు చర్చ మొదలైంది. బైరెడ్డి పార్టీ మారిన తరువాత టీడీపీ అధిష్టానం ఏ టికెట్ కేటాయిస్తుందన్న అంశం పక్కన పెడితే... రాజకీయ వర్గాల్లో మాత్రం సీమనేత బీజేపీలోనే కొనసాగుతాడా.. లేక మళ్లీ సైకిల్ ఎక్కుతాడా అన్నదానిపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story