Editorial: "వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు"

Editorial: వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు
రసవత్తరంగా మైదుకూరు రాజకీయం; పుట్టా, రఘురామిరెడ్డి మధ్య హోరాహోరీ; అధికారపార్టీపై తీవ్రమవుతున్న వ్యతిరేకత; సొంతపార్టీపైనే సీనియర్ విమర్శనాస్త్రాలు; ఓవైపు అభివృద్ధి లేమి, మరోవైపు అసంతృప్తులు.....

దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన జంక్షన్ లలో మైదుకూరు టౌన్ ఒకటి. రాయలసీమకు నడిగడ్డ లాంటి ఈ మైదుకూరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతులను కలిపే అతి పెద్ద రవాణా కూడలి. జాతీయస్థాయిలో కృష్ణపట్నం, తమిళనాడులోని ఎన్నూరు పోర్టులతో రోడ్డు మార్గాలను అనుసంధానించే అదిపెద్ద జంక్షన్. ఇంతటి పారిశ్రామిక నేపథ్యం ఉన్న మైదుకూరు.. అభివృద్ధి పరంగా మూలన పడింది. చెప్పుకోదగ్గ వ్యాపార సంస్థలు గాని, పట్టుమని పది కుటుంబాలకు ఉపాధినిచ్చే చిన్న తరహా పరిశ్రమలు గానీ ఇప్పటివరకు స్థాపించలేదు. విస్తారమైన ప్రకృతి వనరులున్నా రాజకీయంగా తీవ్ర వెనుకబాటుకు గురైంది. అధికార పీఠం ఎక్కిన ఆయా ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పి, రాజకీయ పరపతి సాధించినా.. మైదుకూరు నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందనే తీవ్ర విమర్శలున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైదుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో దశాబ్దకాలం కిందటి వరకు డీఎల్ రవీంద్రారెడ్డిది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, నాలుగు సార్లు కేబినెట్లో బెర్త్ సంపాదించారు. తర్వాత జరిగిన రాష్ట్ర విభజనతో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీతో డీఎల్ రాజకీయ ఇరకాటంలోకి నెట్టి వేయబడ్డారు. 2019 సంవత్సరంలో రాజకీయాలకు తొలిగా పరిచయమైన టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు సహకరించినా.. డీఎల్ మద్దతు పుట్టాను గెలిపించలేకపోయింది. తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన డీఎల్... అధిష్టానంతో విభేదించి ఇటీవల వరుస విమర్శలతో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదు.. ఒకవేళ టీడీపీలోకి వెళ్లినా టికెట్ ఇచ్చే పరిస్థితిలేదు. అలా డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది.

మైదుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, టీడీపీ బీసీనేత పుట్టా సుధాకర్ యాదవ్ ల మధ్య రాజకీయ పోరు రంజుగా మారింది. వైసీపీ ఆవిర్భావం తరువాత తెలుగుదేశాన్ని వీడి వైసీపీ కండువా కప్పుకున్న రఘురామిరెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలిచారు. 2014లో రాజకీయ రంగ ప్రవేశంతోనే ఓడిపోయిన పుట్టా.. ఓటమి వేదికగా మైదుకూరు రాజకీయాలను వంట పట్టించుకున్నారు. ఎమ్మెల్యేగా ఓడినా.. ప్రభుత్వం ఏర్పడటంతో ఇటు జిల్లాలో, అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ పుట్టా సుధాకర్ యాదవ్ కు టీడీపీ సముచిత స్థానం కల్పించింది. రెడ్డి సామాజిక వర్గానికి పెట్టని కోటలాంటి మైదుకూరులో ఓ బీసీ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశంతోనే గెలుపు తీరాల వరకు వెళ్లడంతో అధిష్టానం పుట్టాను మరింతగా ప్రోత్సహించింది.

పుట్టాను టీటీడీ బోర్డు మెంబర్ నుంచి ఏకంగా ఛైర్మన్ గా నియామించింది. ఓవైపు టీటీడీ ఛైర్మన్ హోదా.. నాటి మంత్రి యనమలతో వియ్యంతో.. పుట్టా తన రాజకీయ పరపతిని అమాంతం పెంచేసుకున్నారు. 2014 నుంచి 19 ఆర్థిక సంవత్సరాలకు గానూ మైదుకూరు నియోజకవర్గం లో సంక్షేమ రంగానికి సాగునీటి ప్రాజెక్టులకు, గ్రామీణ రోడ్లకు వివిధ అభివృద్ధి పనులు కింద 950 కోట్ల వ్యయంతో నిధుల వరద పారించారు. ఇలా జిల్లాలో పుట్టా పొలిటికల్ గ్రాఫ్ పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జగన్ జిల్లా వాసి కావడం, వైఎస్సార్ వారసత్వం, ఒక్క ఛాన్స్ లాంటి సమీకరణాలతో తిరిగి పుట్టా రెండోసారి ఓడిపోయారు.

గతేడాది మార్చిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో మైదుకూరు ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రతిష్టను పెంచింది. 24 వార్డులు ఉన్న మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఏకంగా సగం వార్డులను కైవసం చేసుకుంది. అధికార బలంతో టీడీపీ సభ్యుడిని లొంగదీసుకుని ఎక్స్ ఆఫీషియో ఓట్లతో వైసీపీ గద్దెనెక్కింది. ఓవైపు జగన్ ఏలుబడి, మరోవైపు సొంత ఇలాకాలో జరిగిన ఈ మైదుకూరు మున్సిపల్ ఎన్నిక పరిణామంపై వైసీపీ అధిష్టానం కలవరపడింది. ఈ నేపథ్యమే పుట్టా రాజకీయ పరపతికి బాగా కలిసి వచ్చింది. ఇకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. మైదుకూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి అలంకరించి రాజకీయ విరమణ తీసుకోవాలన్నది ఈయన కోరిక. కానీ రెండుసార్లు జగన్ ఈయన్ని నిరాశలోకి నెట్టేశారు.

14 సంవత్సరాలుగా రాజకీయ పెత్తనానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యే అనుచరగణం.... నేడు ప్రకృతి వనరుల కాజేతతో కాసుల వేట కొనసాగిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ, కాలువల ఆధునీకరణ, రాజోలి లిఫ్ట్ ఇరిగేషన్, తెలుగు గంగ పంట కాలవల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు అడుగు ముందుకు పడలేదు.

ఓవైపు అభివృద్ధి లేమి, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, వైసీపీలో దిగువ శ్రేణి నాయకులు ఆగడాలు వెరసి ఈసారి మైదుకూరులో వైసీపీ గెలుపునకు అవరోధం కానుందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి తన మద్దతు విరమించుకుని ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు.. ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారుతాయన్న చర్చ నడుస్తోంది. అటు జనం నమ్మకాన్ని జగన్ పార్టీ కోల్పోయిందన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఇలా అధికారం కట్టబెట్టి ఆదరించినా నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వంతో ఒరిగిందేం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story