Editorial: విజయనగరం జిల్లాలో అధికారపార్టీపై తీవ్ర వ్యతిరేకత

Editorial: విజయనగరం జిల్లాలో అధికారపార్టీపై తీవ్ర వ్యతిరేకత
టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న జనం; ప్రజాదరణతో తమ్ముళ్లలో తీవ్రమైన టిక్కెట్ పోటీ; ఒక్కో నియోజకవర్గంలో ఐదారుగురు ఆశావహులు; సర్వేలతో టిక్కెట్ ఫైట్ కు అధిష్టానం చెక్; పార్టీకి, జనానికి ఉపయోగపడే నేతకే పట్టం

ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఒకటి, రెండు మినహా మిగతా వాటిల్లో టీడీపీ జెండానే ఎగిరేది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ నమ్మించిన జగన్ కి పట్టం కట్టడంతో తొమ్మిది నియోజక వర్గాలు కూడా వైసీపీయే కైవసం చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారం గానీ, స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేల వ్యవహారం గానీ ప్రజలతో పాటు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదట. దీంతో వీళ్లకోక దండం మరలా టీడీపీ వస్తేనే బాగుంటుందని ప్రతిపక్ష నేతల దగ్గర వాపోతున్నారట. ఇలా అధికరపార్టీపై తీవ్ర వ్యతిరేకత... ప్రతిపక్ష టీడీపీకి ఎనలేని ఆదరణ వస్తోందట. ఆదరణో లేక నిజంగా సేవ చేయాలనే తపనో లేక వైసీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారంలోకి రావాలనే యోచనో గాని... టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మధ్య తెగ పోటీ ఉందట. ఎంతలా అంటే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నుండి ఆరుగురు వరకు పోటీ పడేంతలా అంట. నిన్న మొన్నటి వరకు తమకు తిరిగే లేదనుకున్న ఇన్ ఛార్జీలు సైతం ఈ పోటీతో ఉలిక్కి పడుతున్నారట.

ఒక్కసారిగా ఇంతలా పోటీ రావడంతో ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు మొదలైందట. వర్గపోరు అంటే టికెట్ కోసం చేసే ప్రయత్నాలే తప్ప వ్యక్తి గతంగానో లేక వ్యక్తులును ఇబ్బంది పెట్టే వర్గపోరు కాదట. మొదట్లో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్టానం కంగారు పడిందట. ఈ పోటీ ప్రయత్నంలో ఎవరికి సీటు ఇవ్వాలో మిగిలిన వారిని ఎలా సముదాయించాలో అనే ఆలోచనలో పడిన అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందట. ఎవరి వలన పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు ఉపయోగం ఉంటుందో తెలుసుకునేందుకు రెండు టీములతో సర్వే చేయిస్తుందట. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడైతే పోటీ ఉందో ఆ నియోజక వర్గాల్లో ఈ సర్వే చేయిస్తుందట.

ప్రధానంగా నెల్లిమర్ల, కురుపాం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగుతోందట. ఈ నియోజకవర్గాలు అన్నీ కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ జెండాను మరలా ఎగుర వేసేందుకు పోటీదారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారట. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్న పతివాడ నారాయణ స్వామి నాయుడు ఇక్కడ నుండే టీడీపీ ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిపొందారు. వయస్సు రీత్యా వచ్చే ఎన్నికలకు రేసులో లేకపోవడంతో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు తీవ్ర పోటీ పడుతున్నారట. వీరిలో ఒకరు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న కర్రోతు బంగార్రాజు. మరొకరు మాజీ ఎంపీపీగా ఉన్న కంది చంద్ర శేఖర్. దీంతో కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందట. అయితే ఈ లోపు మరొక వార్త కూడా చక్కర్లు కొట్టడంతో నేతలు ఇద్దరు ఫుల్ ఖుషీ ఐపోతున్నారట. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కర్రోతు బంగార్రాజును నెల్లిమర్ల ఎమ్మెల్యే క్యాండీడేట్ గానూ, మాజీ ఎంపీపీగా ఉన్న కంది చంద్ర శేఖర్ ను విజయనగరం ఎంపీగానూ పంపించేందుకు టీడీపీ అధిష్టానం సమాలోచన చేస్తుందంటూ టాక్ నడుస్తోంది.

మరోవైపు కురుపాం నియోజకవర్గం టీడీపీలో ఇదే పోటీ నెలకొంటుందట. పోటీ ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే. ఈ నియోజకవర్గంలో గత రెండు దఫాలుగా వైసీపీకి పట్టం కట్టిన గిరిజన ప్రజలు విసిగి పోయారట. ఎలా అయినా ఈ సారి ఫ్యాన్ రెక్కలు విరిచి సైకిల్ కి పట్టం కట్టాలని దృఢ నిశ్చియంతో ఉన్నారట. దీంతో టీడీపీలో తీవ్రపోటీ నెలకొందట. ప్రస్తుత ఇన్ ఛార్జ్ గా ఉన్న తోయక జగదీశ్వరి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు దత్తి లక్ష్మణరావు వర్గాల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోందట. దత్తి లక్ష్మణరావు వర్గానికి చెందిన ఐదుగురు సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలంటూ పట్టు పడుతుండగా... తనకే టికెట్ ఇవ్వాలంటూ తోయక జగదీశ్వరి పట్టు పడుతోందట. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి

మరోవైపు గజపతినగరం నియోజకవర్గంలో కూడా టికెట్ ఫైట్ గట్టిగానే నడుస్తోందట. స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారి తమ్ముడు కావడంతో ఆయన కూడా మంత్రిలానే ఫీలై ప్రజలను పట్టించుకోవడం మానేశారట. దీనికితోడు భూ దందాల ఆరోపణలు ఎక్కువ కావడంతో.. ఈసారి ఆ ఎమ్మెల్యేని ఇంటికి పంపించి టీడీపీకి పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారట పబ్లిక్. దీంతో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, గెలిచేద్దామా అని ఉవ్విల్లూరుతున్నారట ఆశావహులు. ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు కాగా మరొకరు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సీనియర్ నేత కరణం శివరామ కృష్ణ. వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో గజపతినగరం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.

చివరిగా శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ టికెట్ ఫైట్ గట్టిగానే నడుస్తోందట. ప్రధానంగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కోళ్ల లలిత కుమారి, ఎన్నారై గొంప కృష్ణల మధ్య పోటీ నెలకొందట. వీటికి తోడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వర్గపోరు రావడం, సీనియర్ వైసీపీ నాయకులను ఎమ్మెల్యే సరిగా పట్టించుకోకపోవడంతో అధికారపార్టీపై తీవ్ర అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఈజీ కావడంతో లలిత కుమారి, గొంప కృష్ణ ల మధ్య పోటీ తీవ్రంగా ఉందట.

టిక్కెట్ కోసం నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో.... ఫైట్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం సర్వే చేయిస్తుందట. సర్వే రిపోర్టు ఆధారంగా క్యాండిడేట్స్ ను నియమిస్తుందట. అవకాశం వచ్చిన వారితో మిగతా నాయకులు కలసి నడిచేలా పక్కా ప్లాన్ చేస్తోందట.ఇలా టిక్కెట్ ఫైట్ కు తెర దించనుందట టీడీపీ అధిష్టానం.



Tags

Read MoreRead Less
Next Story