Editorial: "ఆదాల ప్రభాకర్ ను బలిచేసిన జగన్ రెడ్డి..?"

Editorial: ఆదాల ప్రభాకర్ ను బలిచేసిన జగన్ రెడ్డి..?
రసవత్తరంగా నెల్లూర్ రూరల్ రాజకీయం; ఆదాలను అధిష్టానం తెలివిగా ఇరికించిందా? జంప్ కాకుండా ఇన్ ఛార్జ్ పదవితో లాక్ చేసిందా? ఆదాల వెంట లీడరూ లేడూ, క్యాడరూ లేదా? నైరాశ్యంలో ఉన్న విజయకుమార్ రెడ్డి సహకరిస్తాడా?

అనేక తర్జనభర్జనల తరువాత నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డినైతే పంపింది అధిష్టానం. స్వాగతం పలికేందుకు జన సమీకరణ చేయడంలో మాత్రం వైసీపీ నాయకులు విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఎవరికి వారు స్వయంగా ఆదాలకు స్వాగతం పలకాలి అనుకున్నారు తప్ప.. తమతోపాటు మరి కొందరిని తీసుకెళ్లలన్న ఆలోచనను విస్మరించారు. అలా ఆదాల స్వాగత కార్యక్రమం తుస్సుమనిపించారు. తుస్సుమనిపించేది ఏముందిలేండి. ఆదాలతో నడిచేందుకు రూరల్ నియోజకవర్గంలోని క్యాడర్ ముందుకు రాలేదు. 26 మంది కార్పొరేటర్లు, 18 మంది సర్పంచులున్న రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డితో నడిచే ముగ్గురునలుగురిని తప్ప మిగతావారిని నిలువరించడంలో విఫలమయ్యారట అధికార పార్టీ నేతలు. నేతల వరకు ఆదాలకు స్వాగతం పలికారు తప్పా.. క్యాడర్ మాత్రం ముఖం చాటేసిందట. ఆదాలను నమ్మేందుకు క్యాడర్ కాస్త సంసయిస్తోందట.

సహజంగా రాజకీయాల్లో నాయకులకు కొంత బలగముంటే.. పార్టీలకుండె క్యాడర్ పార్టీలకు ఉంటుంది. నాయకులు పార్టీలు మారినప్పుడల్లా.. పార్టీల నుండి క్యాడర్ వెళ్లిపోదు. పార్టీలకు నిర్దిష్టమైన క్యాడర్ అలానే ఉంటుంది. అలానే ఆదాల నాలుగు పార్టీలు మారినప్పుడల్లా వెంబడి వెళ్లిన వారికంటే పార్టీలకుండె క్యాడర్, పార్టీ మీద ప్రజల్లో ఉండే సానుభూతి గెలిపిస్తూ వచ్చింది. మరి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిస్తే ఆ పార్టీలోకి ఆదాల వెళ్లడం సర్వసాధారణం అని జిల్లా వాసులకు తెలిసిన విషయమే. దీంతో ఆదాలకు ప్రత్యేకంగా జిల్లాలో బలమైన క్యాడరంటూ ఏమీ లేదు. ఈనేపథ్యంలో ఆదాల నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుని జిల్లాకు వస్తున్న తరుణంలో ఆయన వర్గమంటూ ఎవరూ లేకపోవడం విశేషం. స్థానికంగా కోటంరెడ్డిని విభేదించిన ముగ్గురు నలుగురు నేతలను సమీకరించి ఆదాల స్వాగతం తూతూ మనిపించారట. ఉన్న కాస్తోకూస్తో వర్గానికి కూడా కార్యక్రమాన్ని బలంగా చేయమని ఆదాల సంకేతాలు ఇచ్చినట్టు కనిపించకపోవడంతో ఇది బలవంతంగా ఆయన భుజాల మీద మోపిన భారంగానే భావిస్తున్నారట అనుచరులు.

దీనికితోడు జిల్లాలో వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక పాలనా నిర్ణయాలు కావొచ్చు.. స్థానిక ప్రజాప్రతినిధుల అధికార అహంకార వేధింపులు కావొచ్చు. మెత్తానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రజాప్రతినిధులు చాలామంది గోడమీద పిల్లుల్లా మారారన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. ఈ లిస్టులో ముందు వరుసలో ఆదాల పేరు వినిపిస్తుండటంతో ఆయన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగానే మెడలో నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ బోర్డు తగిలించి కట్టిపడేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెదటి నుండి కోటంరెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తుందన్న విషయం జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. వీరి మధ్య వార్ ఏ రేంజ్ లో ఉందనే విషయానికి చిన్న ఉదాహరణ.. శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చిన తరుణంలో ఆనం విజయకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఘాటైన విమర్శలు చేయడం. ఎప్పటినుండో ఆనం విజయకుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ మీద కన్నుంది. మెదట అన్న వివేకానందరెడ్డి తన అవకాశాన్ని తన్నుకుపోయాడు. తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పతనమైన తరుణంలో అవకాశం వచ్చినా ప్రజలు తిరస్కరించారు. పోనీ వైసీపీ తరుఫున బరిలో నిలుద్దామనుకుంటే కోటంరెడ్డి అడ్డుతగిలాడు. ఇలా ప్రతీసారి ఎవరో ఒకరి పల్లకీ మోస్తూనే ఉన్నాడు ఆనం విజయకుమార్ రెడ్డి. ఇప్పుడు కోటంరెడ్డి తనదారి తాను చూసుకున్నాడులే ఇక దాదాపు లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాడు. అవకాశం చిక్కిందని శ్రీధర్ రెడ్డితో పాటు సొంతఅన్న ఆనం రామనారాయణ రెడ్డిని తిడితేనైన అధిష్టానం కనికరిస్తుందేమో అని స్కెచ్ వేశాడు. కానీ అధిస్టానం ఈసారి కూడా ఆనం విజయకుమార్ రెడ్డికి మెండి చెయ్యే చూపించింది.

వస్తుందనుకున్న నెల్లూరు రూరల్ సీటు రాకపోగా.. ఎంతగానో అభిమానించే అన్న ఆనం రామనారాయణ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసి విజయకుమార్ ఆయన దగ్గర శత్రువుగా మారాడా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు వాసులు. మొత్తానికి రూరల్ రాజకీయ చదరంగంలో ఎవరు ఎటువైపు ఉంటారో.. ఎవరు అభ్యర్థులు అవుతారో.. ఎవరు విజయం సాధించి పాగా వేస్తారో కాలమే నిర్ణయించాలి.

Tags

Read MoreRead Less
Next Story