Editorial: "ఎచ్చెర్ల, పాతపట్నం ఎమ్మెల్యేలకు టిక్కెట్ డౌటేనా...?"

Editorial: ఎచ్చెర్ల, పాతపట్నం ఎమ్మెల్యేలకు టిక్కెట్ డౌటేనా...?
175 బై 175 అంటూ వైసీపీ హడావుడి; క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నమైన పరిస్థితులు; సిక్కోలు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత; ఫ్యాను పార్టీలో తీవ్రమవుతున్న అసమ్మతి సెగలు; ఎచ్చెర్ల, పాతపట్నం సిట్టింగులకు టిక్కెట్ డౌటే


175 బై 175 అంటూ కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి గల్లీ లీడర్ వరకూ తెగ హడావుడి చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్ధితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అధిష్టానం ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ రకంగా ఉంటే, ఎమ్మెల్యేలను మాత్రం ఎన్నికల ఫీవర్ వెంటాడుతోందట. అస్సలు టిక్కెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ తో ఇపుడున్న చాలామంది ఎమ్మెల్యేలు సతమతమౌతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఆరు చోట్ల విజయం సాధించింది. ఇపుడున్న ఆరు స్ధానాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్ధితి. వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలు, స్థానికంగా ఉన్న అసమ్మతి వంటి అంశాలపై సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో ఆ సర్వే రిపోర్టులు ఎలా ఉంటాయి? సర్వేలు ఎవరి కొంప ముంచుతాయో అన్న టెన్షన్ సిక్కోలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతోందట.

ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్దరిని తప్పించటం పక్కా అంటూ సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం సాగుతోందట. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కిరణ్.. ఆశించిన మేర కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు దగ్గర కాలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో బంధువుల ప్రమేయం అధికమవ్వటంతో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే కంటే ఆయన బంధువుల మాటే చెల్లుబాటు అవుతోందట. మరోవైపు ఎచ్చెర్లలో ప్రస్తుతం మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారంటూ స్ధానికులు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు కిరణ్ పై నియోజకవర్గంలో అసమ్మతి ఎక్కువగా కనిపిస్తోందట. తాను నియమించుకున్న సామంతరాజులకు ఆయా మండలాలకు చెందిన పూర్తి స్ధాయి నిర్ణయాధికారాలు ఇవ్వటంపై.. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి కిరణ్ కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదంటూ ఇప్పటికే అసమ్మతి వర్గం అధిష్టానానికి తేల్చి చెప్పేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని కూడా ఈసారి మార్చుతారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పాతపట్నంలో అధికార పార్టీ కొత్త అభ్యర్ధిని తెరమీదికి తెస్తుందటూ జిల్లా పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట. రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్న పాతపట్నంలో ఇప్పటికే ఇద్దరు సీనియర్ నేతలు తమదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పాతపట్నంలో పరిస్ధితులను గ్రహించిన పార్టీ హైకమాండ్ ఇప్పటికే రెడ్డి శాంతిని హెచ్చరించిందట. మరోవైపు అసమ్మతి నేతలను సైతం వైసీపీ పెద్దలు పిలిపించి ఎమ్మెల్యే అభ్యర్ధి మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోనూ ఫ్యాను గాలి బలంగానే వీచింది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును సద్వినియోగం చేసుకోవాల్సిన కొంతమంది ఎమ్మెల్యేలు వాటిని లైట్ తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల పదవులకు ఇపుడు గండి పడుతోందనే చర్చ సాగుతోంది. నియోజకవర్గ స్థాయిల్లో గతంలో ఎన్నడూ లేని అసమ్మతి.. ప్రస్తుతం సిక్కోలు అధికార పార్టీలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో ఫ్యాను పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి జిల్లా వాసుల్లో కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story