Editorial: నెల్లూరు రూరల్ లో పొలిటికల్ థ్రిల్లర్

Editorial: నెల్లూరు రూరల్ లో పొలిటికల్ థ్రిల్లర్
"రేపోమాపో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డినీ అరెస్ట్ చేయబోతున్నారా..?" శ్రీధర్ రెడ్డి వర్సెస్ జగన్ సర్కార్; ఎమ్మెల్యేపై మొదలైన కక్ష సాధింపు; పాత కేసులన్నీ తోడుతున్న ప్రభుత్వం; భద్రత తగ్గింపు, అనుచరుల అరెస్టులు; ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు

నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను మాత్రమే కాదు.. స్వపక్షంలో గెలిచి సర్కారు తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యేలకు సైతం చుక్కలు చూపిస్తోందట. నాలుగేళ్లు అధికారం అనుభవించిన నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న సందేహం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. 2019 ఎన్నికలకు ముందు వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాటి ప్రభుత్వంపై పోరాటం చేసి తన నియోజకవర్గానికి కావల్సినన్ని నిధులు మంజూరప చేయించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకొని తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నాలుగేళ్ళు నెల్లూరు రూరల్లో గడపగడపను ఒకటికి మూడు సార్లు తొక్కారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలొ తన వంతు కృషి చేశారు. వైసీపీ అధినేతకే గడపగడపకు పార్టీకి తీసుకెళ్లాలనే ఆలోచన కలిగించిన నాయకుడు శ్రీధర్ రెడ్డి.

తనకు నచ్చకో, నమ్మకం లేని చోట ఉండలేకో శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అంతగా పట్టించుకోరులే అనుకున్నారు జిల్లా ప్రజలు. అయితే ఇంత త్వరగానే శ్రీధర్ రెడ్డిపై కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతారని ఎవరు ఊహంచలేదు. పార్టీ నుండి బయటకు వచ్చాడే కానీ ఇంతవరకు మరో పార్టీలో చేరింది లేదు. ఇంత కాలం ఉండి వచ్చిన పార్టీ గురించి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడిందీ లేదు. కేవలం తనను నమ్మని దగ్గర ఇమడలేను అని చెప్పాడే తప్ప పార్టీలో తనకు ద్రోహం చేశారని ఎక్కడా చెప్పలేదు. వైసీపీకి ఎక్కడా నష్టం చేకూర్చే ప్రకటనలు కానీ.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటమూ గానీ చేయలేదు. అయినా శ్రీధర్ రెడ్డిపై ఎందుకీ కక్ష అనేది ఇంత వరకు నెల్లూరు ప్రజలకు అర్థం కావడం లేదట.

తనను నమ్మక పోవడం వల్లే పార్టీని వీడి బయటకు వచ్చానని శ్రీధర్ రెడ్డి అనేకసార్లు మీడియా సమావేశాల్లో స్పష్టంగా చెప్పుకొచ్చాడు. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టీపెట్టగానే అది మీడియాల్లో ప్రసారం కాక మునుపే నెల్లూరు రూరల్ కి కొత్తగా బాధ్యతలు తీసుకున్న వైసీపీ నాయకుడు నుండి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మేల్యేల వరకు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అంతేకాదు తన దగ్గర ఏళ్ల తరబడి ఉండి కార్పొరేటర్ సీటు వస్తుందో రాదో తెలియక తికమక పడుతుంటే.. వారికి సీట్లిచ్చి, స్వయంగా వారి తరఫున ప్రచారం చేసి మరీ గెలిపించాడు శ్రీధర్ రెడ్డి. ఇపుడా కార్పొరేటర్లతోనూ నోటికొచ్చినట్టు విమర్శలు చేయించి, తొడలు కొట్టించి మాట్లాడించటం జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోందట. ప్రజలు తేరుకునేలోపే శ్రీధర్ రెడ్డికి ఉన్న.. టు ప్లస్ టు సెక్యూరిటీని తగ్గించారు. నియోజకవర్గంలో తిరగాలంటేనే అభద్రతకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని చూసి ఇదేందిరయ్యా అనుకుంటున్నారట జిల్లా వాసులు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాకే తలమానికమైన బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ పరిధిలోనె ఉంది. దేశవిదేశాల నుండి లక్షల్లో భక్తులు కులమతాలకు అతీతంగా వచ్చి మెక్కులు చెల్లిస్తుంటారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. బారాషాహీద్ దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వం బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. నిధులు కేటాయించమని అడిగినా పట్టించుకోని పరిస్థితి. నిధుల కోసం స్వయంగా తానే వారానికోసారి అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేశానని ముస్లిం నేతల సమావేశంలో చెప్పిన తర్వాతిరోజే శ్రీధర్ రెడ్డి అనుచరులను ఊహించని విధంగా అరెస్టు చేసింది ప్రభుత్వం.

అసలేం జరుగుతుందని తెలుసుకునేలోపే మరో ఇద్దరు శ్రీధర్ రెడ్డి అనుచరులను పోలీసులు పాత కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నెల్లూరు ప్రజలు తీక్షణంగా గమనిస్తున్న విషయం ఏంటంటే.. నేడు అరెస్టయిన శ్రీధర్ రెడ్డి అనుచరులు నాలుగు నెలల క్రితం మాతంగి క్రిష్టా అనే రాష్ట్రస్థాయి దళిత టీడీపీ నేతపై దాడి చేసిన కేసుగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే నాడు ఇదే దాడికి సంబంధించి టీడీపీ నేతలు... తమ నాయకుడిపై శ్రీధర్ రెడ్డి అనుచరులే దాడి చేశారు. వారు వీరే అంటూ పేర్లతొ సహా చెప్పినా.. పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు ఇదే కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ నేడు అదే కేసు పై పోలీసులు శ్రీధర్ రెడ్డి అనుచరులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అంటే.. ప్రభుత్వంలో ఉంటే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే.. ఏం తప్పు చేసినా పట్టించుకోరా. ఏ కేసైనా బుట్టధాఖలు కావల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు ప్రజలు.

నెల్లూరు ప్రజలకు తలెత్తుతున్న మరో అనుమానం ఏంటంటే. శ్రీధర్ రెడ్డి అనుచరుల అరెస్టులతోనే ఆపుతారా లేక నేడోరేపో శ్రీధర్ రెడ్డిని సైతం పాత కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇటు శ్రీధర్ రెడ్డి మాత్రం కేసులకు, అరెస్టులకు జడిచేదేలే అంటున్నాడట. మరి ప్రభుత్వం వర్సెస్ శ్రీధర్ రెడ్డిగా జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story