Editorial: "ఏలూరు ఎంపీ మిస్సింగ్..? ఆందోళనలో ఓటేసిన ప్రజలు.."

Editorial: ఏలూరు ఎంపీ మిస్సింగ్..? ఆందోళనలో ఓటేసిన ప్రజలు..
ఏలూరు ఎంపీ దాగుడు మూతలు; గెలిచి మూడున్నరేళ్లవుతున్నా జాడేలేదు; ప్రజలు, వారి సమమస్యలంటే లెక్కేలేదు; అమెరికాలో మకాం, అప్పుడప్పుడు అతిథి అవతారం; మీ ఎంపీ ఎవరంటే బిక్కమొహం వేస్తున్న జనం


ఏలారు పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడిగా శ్రీధర్ రాజకీయ ప్రవేశంచేసి వైసీపీ తరఫున గెలిచాడు. అంతకముందు 2014లో బీజేపీలో చేరిన కోటగిరి శ్రీధర్.. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి 2017లో వైసీపీ గూటికి చేరాడు. వాస్తవానికి ఏలూరు పార్లమెంట్ పై కోటగిరి శ్రీధర్ కు అంత పట్టేం లేదు. కానీ తండ్రి విద్యాధరరావు టీడీపీలో మంత్రిగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి ప్లస్ అయింది. అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకు వైసీపీ తరఫున ఎవరూ పోటీచేయలేదు. దీంతో మాజీమంత్రి వారసుడిగా.. డబ్బు, హంగు ఉన్న శ్రీధర్ కు వైసీపీ అధిష్టానం ఎంపీ సీటు కన్ఫర్మ్ చేసింది.

2019 ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ గెలిచాక కొన్ని రోజుల పాటు నియోజకవర్గాల్లో తూతూ మంత్రంగా పర్యటించారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపించి మమా అనిపించాడే తప్ప చేసిందేమి లేదు. గెలుపొందిన కొద్దీ రోజులకే అమెరికాకు మకాం మార్చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఎంపీ అమెరికాలో ఉన్నాడో... ఏలూరులో ఉన్నాడో నియోజకవర్గ ప్రజలకు జాడే తెలియదట. మూడున్నరేళ్లలో ఏలూరు నుంచి అమెరికాకు, అమెరికా నుంచి ఏలూరుకు తిరగడమే తప్ప ఏనాడు నియోజకవర్గాల స్థాయిలో ఒక్కసారి కూడా పూర్తిగా పర్యటించిన పాపాన పోలేదట. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పెట్టిన కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ స్టయిల్ లో వచ్చి వెళ్లిపోతారే తప్ప జనంతో మాట్లాడటం గానీ, వారి సమస్యలు వినడం గానీ ఎంపీ గారి డిక్షనరీలో లేవని టాక్. ప్రభుత్వపరంగా ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒక్క కార్యక్రమం గానీ, పర్యటన గానీ చేయలేదట. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారట ప్రజలు. ఎంపీని కలవడానికి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని సిచ్చువేషన్ క్రియేట్ అయిందంటే కోటగిరి శ్రీధర్ నిర్వాకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏలూరు క్యాంపు కార్యాలయంలో గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఎంపీగారు ఒక్కసారి కూడా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించిన పాపాన పోలేదట. పార్లమెంట్ సమావేశాలపుడు ఎంపీని టీవీల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం లేదని ప్రజలు వాపోతున్నారట. అసలు ఏలూరు ఎంపీ ఎవరని అడిగితే... ఎవరో తెలియని అయోమయంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారంటే.... ఇది అయ్యగారు సాధించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోటగిరి విద్యాధరరావు తెలుగుదేశం పార్టీలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టి జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు.

ఇదిలా ఉంటే కోటగిరి శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టును ఎంపీ స్థానంలో ఉన్న శ్రీధర్ ఒక్కసారి కూడా సందర్శించిన దాఖలాలు లేవట. ఎంపీ హోదాలో ప్రాజెక్టు సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో కనీసం గొంతెత్తలేదట. దీంతో ఎంపీ తీరుపై పోలవరం నిర్వాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా ఎంపీగారు తమకు ముఖం చూపించక పోరా, తమ సమస్యలు ఆలకించకపోరా అని కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారట. చూడాలి మరి జనం విజ్ఞప్తులు అమెరికా ఎంపీగారికి... సారీసారీ మన ఏలూరు ఎంపీగారికి చేరుతాయో లేదో.

Tags

Read MoreRead Less
Next Story