Editorial: "సిక్కోలు వైసీపీలో ఎమ్మెల్సీ రచ్చ.. అధిష్టానంపై రెబల్స్ తిరుగుబాటు"

Editorial: సిక్కోలు వైసీపీలో ఎమ్మెల్సీ రచ్చ.. అధిష్టానంపై రెబల్స్ తిరుగుబాటు
సిక్కోలు వైసీపీలో ఎమ్మెల్సీ రచ్చ; అధికారపార్టీకి తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక; కులాల మధ్య చిచ్చురేపిన ఎన్నికలు; అధిష్టానంపై అసంతృప్తి నేతల తిరుగుబాటు; స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలిపి మరీ సవాల్


రాజకీయపార్టీల్లో సామాజిక సమీకరణాలు ఒక్కోసారి బెడిసికొడుతుంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ ప్రకటించిన అభ్యర్ధుల ఎంపిక ఇపుడు కులాల మధ్య కుంపటి రాజేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించటంతో కొన్ని సామాజికవర్గాలు సీఎంపై నిప్పులు చెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇచ్చాపురం నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రామారావు అభ్యర్థిత్వం ప్రకటనకు ముందు అధికార పార్టీలో చాలా సీన్ నడిచిందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది.

వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో కాపు సామాజికవర్గానికి అధికార పార్టీలో ఇంతవరకూ సముచిత స్ధానం దక్కలేదు. అయితే స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. వైసీపీ పెద్దలు సైతం చివరి నిమిషం వరకూ ఒకరిద్దరు జిల్లాకు చెందిన కాపు నేతల పేర్లను పరిశీలించారు. అయితే చివరి నిమిషంలో ధర్మాన సోదరులు యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావు పేరును ప్రపోజ్ చేశారట. ఈ నిర్ణయంపై సిక్కోలు కాపు నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో తమను రాజకీయ లబ్ధికి వాడుకున్న ధర్మాన సోదరులు, వైసీపీ పెద్దలు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 779 ఓట్లు ఉన్నాయి. వీటిలో తూర్పు కాపు, కళింగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఆవరేజ్ గా చూస్తే తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. అయినప్పటికీ ఏ సమీకరణాల ప్రకారం అభ్యర్ధిని ఎంపిక చేశారనే చర్చ ఇపుడు జిల్లాలో సాగుతోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్న సిక్కోలు తూర్పుకాపు సంఘం నేతలు... రహస్య సమావేశం నిర్వహించారు. అనుకున్నదే తడువుగా కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేతను స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దించారు. దీంతో తమ ప్లాన్ బెడిసి కొట్టిందని జిల్లా వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.

ఎమ్మెల్సీ ఎన్నికలకే అధికారపార్టీలో అసంతృప్తి సెగలు ఈ రేంజ్ లో ఉంటే... సాధారణ ఎన్నికలనాటికి ఇది ఊహకందని స్థాయికి చేరబోతుందనేది స్పష్టమవుతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు అంత వీజీ ఏం కాదనే చర్చ జోరందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story