Editorial: పతనం దిశగా వైసిపి పయనం?

Editorial: పతనం దిశగా వైసిపి పయనం?
నెల్లూరు జిల్లాలో వైసీపీ పతనం దిశగా పయనిస్తోందా? ; పార్టీని భుజాన మోసిన నేతలే ఒక్కొక్కరుగా బరువు దించుకుంటున్నారా? వైసీపీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయా? ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతున్నాయా? అధినేత తీరుతో మిగతా ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గేమ్ ఛేంజర్ కానుందా?



నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం దాపురించిందా?

పార్టీని భుజాన మోసిన నేతలే కాడి వదిలేస్తున్నారా?

అధినేత తీరుతో పక్కచూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు ?

రాష్ట్ర రాజకీయాలను నెల్లూరు శాసించనుందా?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి పట్టున్న రాయలసీమలో ఆ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతోందని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా పరిణామాలు వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని స్థానికుల్లో టాక్ నడుస్తోంది. కష్టకాలంలొ జగన్ వెంట నడిచి.. పార్టీని అంటి పెట్టుకొన్న నేతలు అధికారంలో ఉన్నప్పటికి మాకొద్దు బాబు ఈ అధికారం అంటు వైసీపీ నుండి బయటకు వచ్చేస్తుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడంతో అధికార పార్టీలో ముసలం మొదలయినట్లు విశ్లేషకులు లెక్కలు గడుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించిన ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన విధానంపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోందట. అసలు వైసీపీని సీనియర్ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇక వైసీపీ పని అయిపోయిందా అన్న చర్చ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని వినికిడి.

పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన ఆ ముగ్గురు నేతలు ఏదో గాలివాటాంగానో.. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతోనో ఒక్కసారిగా తెరమీదకు వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు కాదు. ఒక్కొక్కరు రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టున్న నేతలు కావడం విశేషం. సస్పెన్షన్ కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు వేర్వేరు రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ వీరిని కలిపిన ఏకైక అంశం ఏంటంటే మొదటి నుండి వైఎస్ కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉండటం. ఇప్పటి ఆనం కుటుంబాన్ని వెన్ను తట్టి నడిపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే ఆనం కుటుంబం వైఎస్ వెంట నడిచారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే గెలవటం కాదు.. ఇతర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.. వైఎస్ కు నమ్మిన బంటులా వెన్నంటి నడిచిన ఆనంను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుండి వైసీపి అధిష్ఠానం వేధింపులకు, అవమానాలకు గురి చేసిందని ఆరోపించారు. ఇటు మేకపాటి, కోటంరెడ్డి కుటుంబాలు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న విశ్వాసంతో జగన్ వెంట నడిచారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో ఎందుకు విభేదిస్తున్నారో వైసీపీ పోస్టుమార్టం చేసుకోకుండా పార్టీ నుండి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసింది.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురిని సస్పెండ్ చేయడంతో మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలలో ఎవరు ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు గోడదూకేందుకు సిద్ధపడుతున్నారని పబ్లిక్ టాక్. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటం.. పార్టీని సమర్ధవంతంగా నడపలేకపోవడం..రాబోయే ఎన్నికల్లో పార్టీ గట్టేక్కే పరిస్థితులు కనిపించకపోవడంతో జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story