Editorial: మళ్లీ మోసం!!

Editorial: మళ్లీ మోసం!!
రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు; దగా పడ్డామన్నదే అందరి మాట...


మోసం, దగా, వంచన, కుట్ర... ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జగన్ సర్కారు తీసుకుంటున్న వరుస యూ టర్న్ ల సారాంశం ఒక్కపదంలో ఇలానే చెప్పొచ్చేమో. అమరావతే రాజధానని ఓసారి, అమరావతి కూడా రాజధానే అని మరోసారి, విశాఖపట్నమే అసలు రాజధానని ఇప్పడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారుస్తూపోతున్న మాటలు అందుకు బలాన్నిస్తున్నాయి. అధికారంలోకి రాకముందు రాష్ట్ర రాజధాని పై వైఎస్సార్సీపీ చెప్పిన మాటలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నమ్మబలికిన వాగ్ధానాలు ఇవన్నీ కచ్చితంగా ఆ కోవలోకి వస్తాయి.

ఉమ్మడి రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ను వదులుకుని అక్కడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమైన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న గందరగోళంలో పడిపోయాడు. ఒక రాష్ట్రం అభివృద్ధి ఆ రాష్ట్ర పట్టణీకరణ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు సాధించగలిగిన మహా నగరాల పై ఆధారపడి ఉంటుంది.. కానీ విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే రాజధాని కావాలన్న ఉద్దేశంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. ప్రపంచ స్థాయి నగరాలతో సరితూగేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రజలు కాక్షించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతూ 33వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. వ్యవసాయ భూములను నగర నిర్మాణం కోసం ఇవ్వడం పట్ల కొద్దిమంది అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వము, ప్రభుత్వాని కంటే ఎక్కువ ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల నమ్మకం కలిగించే మాట్లాడారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదనీ 33వేల ఎకరాలు కాదు 50వేల ఎకరాలు రాజధాని కోసం ఇస్తే తనకు అభ్యంతరం లేదని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు తమ ప్రభుత్వం వస్తే రాజధాని మారుస్తారన్న అనుమానాలకు సమాధానంగా తాను అమరావతిలోనే సొంత ఇల్లు కట్టుకున్నానని చంద్రబాబు కంటే తనకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందని జగన్ చెప్పిన మాటలు నేటికీ రాజదాని ప్రాంత రైతులు గుర్తు చేస్తుంటారు. దీన్నిబట్టి నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడదగిన కొత్త రాజధాని అవసరాన్ని అప్పటి ప్రతిపక్ష నేత.. నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా సమర్థించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తో సమానంగా అమరావతి ప్రాతంలోనూ అత్యధిక స్థానాలు కట్టబెట్టారు స్థానిక ఓటర్లు.

కాని అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు రాజధాని రైతుపై, ఆంధ్రప్రదేశ్ సామాన్య పౌరుడిపై పిడుగుల్లా గాయపరుస్తున్నాయి. మొదట అమరావతి రాజధాని కోసం భూసేకరణలో అవకతవకులు జరిగాయనీ, వాటిపై విచారణ జరిపించాలని చెబుతూ కొత్త రాజధాని నిర్మాణ ప్రక్రియను పక్కకు పెట్టారు. తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంత పెద్ద రాజధాని అవసరం లేదని మరో పల్లవి అందుకున్నారు. ఈ రెండు మాటలూ రాష్ట్ర ప్రజలకు జగన్ చిత్తశుద్ధిపట్ల కొంత అనుమానాన్ని వ్యక్తం చేసినా అతని అసలు రూపం మాత్రం ఆ తర్వాత బయటపడింది అంటున్నారు రైతులు.

అమరావతి రాజధాని నిర్మాణం ఏ స్థాయిలో చేయాలన్న అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టి అసలు రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న పాత చర్చను కొత్తగా తెరపైకి తెచ్చారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పేరిట ఓ నివేదిక కోరి ఆ నివేదిక రాకముందే అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మొదటి గుణపం గుచ్చారు. అది మొదలు ఇప్పటివరకు పదేపదే రాజధాని అంశంపై ప్రకటనలు చేస్తూ ఆ గాయాన్ని మరింత రెచ్చగొట్టేలా జగన్ ప్రభుత్వం చేస్తుందని ప్రతిపక్షాలు వాదన. మొదట మూడు రాజధానులనీ, అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుందని చెప్పిన జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు అసలు అది కూడా ఉండదన్న దిశగా కదులుతున్నాయి.

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డి. 33 వేల ఎకరాలు రాజధాని కోసం విరాళం ఇచ్చిన రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తారన్న సమాధానం ఇవ్వలేదు. అసలు మా పరిస్థితి ఏంటని వెయ్యి రోజులకు పైబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో ఇప్పటివరకు కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవైపు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్తూ మరోవైపు విశాఖే రాజధాని అన్న ప్రకటనలు చేస్తూ జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు కచ్చితంగా మోసం, దగా, కుట్ర క్రిందకే వస్తాయి.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో విశాఖపట్నం మా రాజధాని కాబోతుందనీ, నేను కూడా మరికొన్ని మాసాల్లో అక్కడికి మఖాం మార్చబోతున్నాననీ చెప్పడం జగన్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికీ, ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏం చేస్తారన్నది స్పష్టత ఇవ్వకుండానే ఆ విషయం ఇంకా కోర్టు పరిధిలో విచారణలో ఉండగానే ముఖ్యమంత్రి ఈ తరహా వ్యాఖ్యానించడం రాజకీయ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఐతే ఇది జగన్ అనాలోచిత నిర్ణయం మాత్రం కాదు, ఆయన వ్యూహత్మకంగానే ఈ వంచన పధకం చేపట్టారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఎవరిపట్లా చిత్తశుద్ధి లేని తీరు...

రైతులకు మోసం ...

33 వేల ఎకరాలు సేకరించే సమయంలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యతను జగన్ సర్కారు విస్మరించారు. అంతేకాదు అగ్రిమెంట్లలో పేర్కొన్నట్టు రాజధానిని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్దిచేసి వారికి అవ్వాల్సిన డెవలప్డ్ సైట్స్ ఇవ్వాలన్న అంశాన్నీ విస్మరించారు. ఇందేటని ప్రశ్నిస్తే వారిపై కులం ముద్రవేసారు. అసలు ఇంతవరకూ వారి గోడు వినేందుకు సైతం సీఎం సిద్దంగాలేకపోవడం ఖచ్చితంగా రైతులను వంచించడమే. రాష్ట్ర భవిష్యత్ కచ్చితంగా యువతపైనే ఆధారపడి వుంటుంది. జాతీయ స్ధాయి విధ్యాసంస్ధలు, అతర్జాతీయ స్ధాయి ఉద్యోగాలు కల్పించే కంపెనీలన్నీ హైదరాబాద్ కే పరిమితం కావడంతో ఆంధ్రప్రదేశ్ యువత భరోసా కోల్పోయింది. అమరావతి కాస్మోపాలిటన్ ఫెసిలిటీస్ వున్న నగరంకా వృద్దిచెందుతుందని భావించిన యువత, వారి భవిష్యత్ కోసం జీవనోపాది ఇచ్చే భూములను ప్రభుత్వానికిచ్చిన వారి తల్లిదండ్రుల ఆశలపై ఏకకాలంలో నీళ్లుచల్లి జగన్ మరోసారి మోసం చేశారు..యువతకు తీరని అన్యాయం చేశారు. సన్ రైజింగ్ స్టేట్ గా ఉన్న ఏపీలో ఏర్పడే నూతన రాజధానిలో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వం అనేక అంతర్జాతీయ కంపెనీలనుంచి పెట్టుబడులను ఆహ్వనించింది. రాజధాని నిర్మానాన్ని త్రిశంకు స్వర్గంలోకి విసిరిని జగన్ ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీల విశ్వాసానికి సైతం దూరమయ్యారు.

కోర్టుల పట్ల లెక్కలేని వైఖరి... ఇచ్చిన హామీ మేరకు రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వాటిని వమ్ముచేయడంతో కోర్టులను ఆశ్రయించడం రైతులకు తప్పలేదు. మొదట మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కోర్టుకు చెప్పిన వైసీపీ ప్రభుత్వం తర్వాత అమరావతే ప్రస్తుత రాజధాననీ, శాసన సభలో చేసిన చట్టాన్ని ఉపసంహరించుకున్నామనీ, సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చిందని చెప్పి న్యాయ స్ధానాన్ని సైతం గందరగోళపరిచే ప్రయత్నం చేసింది. ఓవైపు కోర్టుకు అలా చెప్తూనే కోర్టు వెలుపల మాత్రం వైసీపీ నేతలు మూడు రాజధానుల పల్లవి పాడుతూనే వున్నారు. మళ్లీ కొత్తగా, సమగ్రంగా మూడు రాజధానులు బిల్లు తెస్తామంటూ, రాజధాని నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికార పరిధిలోదనీ భిన్న ప్రకటనలు చేస్తునే వున్నారు. ఇలా కోర్టులను సైతం పరిహాసమాడే జగన్ సర్కారు లెక్కలేనితనం ఇప్పుడు సుప్రీం కోర్టు స్ధాయికి వెల్లిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

పరిపాలనా పరమైన గందరగోళం ...

శాసన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు మండలిలో ఆమోదం పొందలేదన్న అక్కసుతో ఏకంగా శాసనమండలినే రద్దుచేయాని నిర్ణయించడం, వెంటనే తీర్మానంచేసి పార్లమెంటుకు పంపడం సైతం జగన్ ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనం. అమరావతి కేలవం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని బహిరంగ ప్రకటనలు ఓవైపు చేస్తూ.. కోర్టులకు మాత్రం రైతులకు అగ్రింమెంటు ప్రకారం అభివృద్దిచేసిన స్ధలాలిస్తామనడం మరో అసంబద్ద నిర్ణయానికి ప్రతీక. రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు అమరావతి ప్రాంత భూములను అమ్మకానికి పెట్టి అవి భవిష్యత్లో ఎదగబోతున్న మహానగరంలో భాగంమని అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడమూ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు మరో మచ్చుతునక.

ప్రాంతీయ సామరస్యానికి తీరని ద్రోహం...

రాజధాని అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ స్వంతం. కానీ అమరావతిని మాత్రం ఓ పరిమిత ప్రాంత వాసులకు అందునా ఒకే సమాజికవర్గం వారికోసమే నిర్మిస్తున్నారన్న వాదనలు తీసకొచ్చి ప్రాతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం సాక్షాత్తూ ముఖ్యమంత్రే చేయడం తగదు. కాలగమనంలో దాదాపూ సమసిపోయిన పాత ఆకాంక్షలను రెచ్చగొట్టి పదే పదే ప్రాంతీయ భావాలు ప్రోత్సహించడం నిజంగా గర్హనీయం. ఐతే అందులోనూ వారు చిత్తశుద్ది చూపట్లేదన్న విమర్శలూ వస్తున్నాయి. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్లో హైకోర్టు ఉండాలన్న డిమాండ్ ను సైతం జగన్ మంత్రివర్గ సహచరులు పక్కన పెడుతున్నారు. హామీల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఇది పరాకాష్ట. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మాట్లాడుతూ మూడు రాజధానుల మాటను తప్పుగా అర్ధంచేసుకుంటున్నారనీ.. విశాఖ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు కార్యనిర్వాహక రాజధానిగా ఉంటుందని, కర్నూల్ లో హైకోర్టు ప్రిన్సిపల్ బ్రాంచ్ ఉండాలన్న సెంటిమెంట్ ను మాత్రమే గౌరవిస్తున్నామని... కర్ణాటక మహారాష్ట్ర తరహాలో శాసనసభ సమావేశాలు ఒకసారి మాత్రమే అమరావతిలో పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో కూడా ప్రజలను తృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల, ప్రజలకిచ్చిన హామీల పట్ల అంతకంటే ఏమాత్రం గౌరవం లేకుండా ఏమార్చడం మాత్రమే తమ పరమావధని చెప్పకనే చెప్పుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరులో రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్తు పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి లేకపోగా కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల లబ్ధి మాత్రమే తమ ఉత్కృష్ట లక్ష్యాలుగా వ్యవహరిస్తున్నారని సుస్పష్టం.

అందుకే మొదట అమరావతి మాత్రమే, తర్వాత మూడు రాజధానులు, ఆ తరువాత విశాఖ మాత్రమే రాజధాని అన్న మాటలు నూటికి నూరుపాళ్ళు మోసం, వంచన, కుట్ర క్రిందకే వస్తాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఇది వ్యూహమని జగన్ భావించొచ్చు.. కానీ ప్రజలు మాత్రం మేమన్నీ గమనిస్తున్నాం అప్నా టైం భీ ఆయేగా అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story