Editorial: "కొండారెడ్డి బురుజు గడ్డపై బొక్కబోర్లా పడనున్న ఫ్యాన్..!"

Editorial: కొండారెడ్డి బురుజు గడ్డపై బొక్కబోర్లా పడనున్న ఫ్యాన్..!
రసవత్తరంగా కర్నూల్ వైసీపీ రాజకీయం; హఫీజ్, ఎస్వీ వర్గాల మధ్య ముదురుతున్న వైరం; ఎమ్మెల్యే అనుచరుల అరాచకలపై జనాగ్రహం; సిట్టింగుకు వచ్చేసారి టిక్కెట్ డౌటనే ప్రచారం; అనూహ్యంగా రేసులోకి మరో మైనార్టీ నేత

కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటర్ల నాడి ఎవరూ అంచనా వేయలేరు. ప్రతి ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ పడినప్పటికీ ఓటర్ల తీర్పు మాత్రం ఇంకోలా వెలువడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కనిపించింది. జగన్ ఒక్కచాన్స్ నినాదంతో రాష్ర్టంలో ఫ్యాన్ గాలి బాగా వీచింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగలిగింది. కొన్ని సెగ్మెంట్లలో మాత్రం టీడీపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అలాంటి వాటిలో కర్నూలు సెగ్మెంట్ ఒకటి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గట్టిపోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కీలకం కాబట్టి.

పాదయాత్రలో కర్నూలుకి వచ్చిన జగన్.. టికెట్ ను ముస్లిం మైనార్టీలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో రాజకీయాలకు కొత్త అయిన హఫీజ్ ఖాన్ ను బరిలో నిలిపారు. జగన్ ఒక్క చాన్స్ నినాదం, ముస్లిం మైనార్టీ సెంటిమెంట్ వర్క్ అవుట్ కావడంతో హఫీజ్ ఖాన్.. టీజీ భరత్ ఇచ్చిన గట్టి పోటీ నుంచి బయట పడగలిగారు. ఎన్నికలు అయ్యాయో లేదో...మాజీఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం... ఎమ్మెల్యే హఫీజ్ వర్గం రెండుగా చీలాయి. ఒకే పార్టీలోనే ఉన్నా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహించుకుంటున్నారు. ఒకే వేదికపై రెండు వర్గాలు కలిసింది తక్కువే. సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుంది అన్నది పక్కన పెడితే.. సీటు మా అన్నకే అంటే లేదు మా అన్నకే అంటూ ఇరువర్గాలు పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటూ వైరల్ చేసుకుంటున్నాయి.

ఇటు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను విమర్శలు చుట్టు ముట్టేస్తున్నాయట. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ పరిధిలోని మున్సిపల్ వార్డుల్లో పూర్తిస్థాయిలో గడప గడపను టచ్ చేయలేక పోతున్నారట. కేవలం తన వర్గీయులు, మద్దతుదారుల ఇళ్లకు మాత్రమే వెళ్లి వస్తున్నారట. టీడీపీ గెలుపొందిన వార్డులకి వెళ్లినా అక్కడ నిరసన సెగ తగలకుండా జాగ్రత్త పడుతున్నారట. టీడీపీ గెలుపొందిన వార్డుల్లోని వైసీపీ క్యాడర్ ను, తన వర్గీయులని అప్రమత్తం చేసి.. వారి ఇళ్లను మాత్రమే టచ్ చేసి వస్తున్నట్లు క్యాడర్ లోనే చర్చ సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రుల దగ్గరి నుంచి అందరు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిలదీతలు, నిరసన సెగలు తగులుతునే ఉన్నాయి. మరి హఫీజ్ కు మాత్రం నిరసన షాకులు ఎందుకు లేవు. అంతగా ఆయన కర్నూల్లో ఏం అభివృద్ధి చేశారని సొంతపార్టీ నేతలే ఆరా తీశారట. అప్పుడే అసలు ట్విస్టు తెలిసింది.

ఎమ్మెల్యే హఫీజ్ ఏదైనా వార్డు పర్యటనకు వెళ్లాలంటే ముందుగా ఆ వార్డులో ప్రజల నుంచి తనకు నిరసన సెగ తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తనకు అనుకూలమైన మీడియానే ఉండేలా చూసుకుంటున్నారట. చుట్టుపక్కల వాళ్లు ఎవరూ సెల్ ఫోన్లతో వీడియోలు తీయకుండా, తన అనుచరులు మాత్రమే తీసేలా ప్లాన్ చేస్తారట. ఎవరైనా కొత్తవాళ్లు నిసనలు, నిలదీతల వీడియోలు తీయకుండా తన అనుచర వర్గంతో కట్టడి చేపిస్తున్నట్లు టాక్. తాను వెళ్లాలి అనుకున్న వార్డుల్లో ఏదైనా సమస్యలుంటే ముందే సంబంధిత వాలంటీర్లతో మాట్లాడి.. సమస్యలపై వినితి పత్రం తీసిపెట్టుకుంటున్నారట. గడప గడపకు వెళ్లినపుడు మీరు నిన్నే వినతి పత్రం ఇచ్చారు కదా అంటూ ముందుకు వెళ్లి పోతున్నారట. ఇదన్నమాట నిరసన సెగలు లేకపోవడం వెనుక జరిగే ప్రీ ప్లాన్ డ్ ప్రోగ్రాం.

దీనికి తోడూ ఎమ్మెల్యే హఫీజ్ వర్గీయుల ఇటీవలి కాలంలో చేస్తున్న, చేసిన... అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో పార్టీలో చెడ్డ పేరు వచ్చేసిందట. గతంలో హఫీజ్ మనుషులు ఏకంగా పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయ్యారు. జోహరాపురం బీడీ వర్కర్స్ కాలనీ వద్ద కొంతమంది వైసీపీ వర్గీయుల ల్యాండ్ కబ్జా వివాదం రచ్చకెక్కింది. తాజాగా పాతబస్తీ అర్బన్ బ్యాంక్ ఏరియాలో ఎమ్మెల్యే హఫీజ్ వర్గీయుడు ఇంతియాజ్ మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేశాడు. హైకోర్ట్ ఆర్డర్ ఉల్లంఘించి బిల్డింగ్ నిర్మానం చేపట్టాడు. కాలనీ వాసులు అడ్డుకుంటే.. 20 మందితో వచ్చి దిక్కున్న చోట చెప్పుకోమంటూ వారిపై దాడికి దిగారు. ఇలాంటి ఘటనలన్నీ ఎమ్మెల్యే హఫీజ్ ను చుట్టుముట్టేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మరో ముస్లిం మైనార్టీ అధికారి టికెట్ రేసులోకి వచ్చేశారు. షేక్ బషీర్ అహ్మద్.. ఈయన ప్రస్తుతం సీఎం జగన్ సొంత ఊరు పులివెందులకి ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి పీఆర్ఓగా పనిచేస్తున్నారు. ఈయనది కర్నూలు. గతంలో ఎస్పీపీఆర్ఓగా పనిచేశారు. రాజకీయ నేతలతో పాటు ప్రజా సంఘాలు, ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి మంచి సంబంధాలున్నాయి. మైనార్టీ కోటా కింద అవకాశం వస్తే ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేయాలని బషీర్ 2009 నుంచి పోటీ కోసం అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ప్రజా మద్దతు ఉన్నా ఆర్థిక వనరులు సమకూరకపోవడం, పైగా ప్రభుత్వ కొలువులో ఉండటం అడ్డంకిగా మారాయట. వైఎస్ జగన్ కుటుంబంతో బషీర్ అహ్మద్ కి మంచి పరిచయాలు ఉండటంతో టికెట్ రేసులోకి బషీర్ అహ్మద్ పేరు వచ్చేసింది. ఇప్పటికే కర్నూల్లో ఏ కార్యక్రమం జరిగిన బషీర్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తన మద్దతుదారులు, ఆదరించే వారు ప్రజాసేవ కార్యక్రమాలతో సంకేతాలు ఇస్తున్నారు. జగన్ టికెట్ కేటాయిస్తే బషీర్ అహ్మద్ జాబ్ వదులుకుని అయినా పోటీ చేయడానికి సిద్ధం అవున్నారట. మొత్తంమీద అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. చూడాలి మరి కర్నూల్ టిక్కెట్ దక్కించుకునేది ఎవరో.

Tags

Read MoreRead Less
Next Story