Andhra Pradesh : ఏపీలో ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.ఎస్.జవహర్‌రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎం.టి.కృష్ణబాబుకు రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్, సీసీఎల్‌ఏగా జి.సాయిప్రసాద్ బదిలీ అయ్యారు.
సాయి ప్రసాద్‌కు రెవెన్యూ భూ రికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్‌కుమార్ బదిలీ అయ్యారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖ హెచ్ఆర్, సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలనూ శశిభూషణ్‌కుమార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలనూ రజత్ భార్గవ చూసుకోనున్నారు.
ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ ఎ.బాబుకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి అనిశా డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.HOPF అదనపు బాధ్యతలోనూ డీజీపీ కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com