ఉద్ధృతమవుతోన్న విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

ఉద్ధృతమవుతోన్న విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
విద్యుత్‌ సౌధ ఎదుట ఇవాళ మహాధర్నాకు పిలుపు


ఏపీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ... విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె కార్యాచరణలో భాగంగా విజయవాడలోని విద్యుత్‌ సౌధ ఎదుట ఇవాళ మహాధర్నాకు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. ఈ మహాధర్నాను విఫలం చేసేందుకు జగన్ సర్కారు.. నిర్బంధ చర్యలకు దిగింది. ఉద్యోగులు విజయవాడ వెళ్లకుండా...కట్టడి చేస్తోంది.

విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు.. మహాధర్నాకు పిలుపునివ్వడంతో... టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే.. ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు...విజయవాడలో 144 సెక్షన్‌ అమలు చేస్తోంది. అయితే.. మహాధర్నా విరమించుకున్నామని ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇవాళ వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. అయినా... విజయవాడలో భారీగా పోలీసులను మోహరించారు. అటు.. విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ సౌధ పూర్తిగా పోలీసులు నిఘా నీడలో ఉంది.

విద్యుత్ ఉద్యోగులు పిలుపునిచ్చిన చలో విద్యుత్‌సౌధకు అనుమతి లేదని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా ప్రకటించారు. చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి గానీ, పోలీసు శాఖ నుంచి గానీ అనుమతి లేదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు ఎవరూ విజయవాడకు రావొద్దని సూచించారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సౌధ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కమిషనర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సౌధ ప్రాంతం పోలీసుల నిఘా నీడలో కొనసాగుతోంది.

Tags

Next Story